Godavarikhani | కోల్ సిటీ , జూన్ 23: రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పలు డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఇంకుడు గుంతలను శుభ్రం చేసి.. మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. స్థానిక బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న రెండు ఇంకుడు గుంతలు, నగర పాలక సంస్థ కార్యాలయం వెనుకాల మరో ఇంకుడు గుంతను శుభ్రం చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చారు.
అలాగే 27, 49, 50 డివిజన్లలో ప్రవహిస్తున్న మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. తర్వాత వంద రోజుల ప్రణాళిక ఫ్లెక్సీ బోర్డు ఎదుట నగర పాలక కార్యాలయంలో అధికారులు, సిబ్బంది సెల్ఫీలు దిగారు. నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఎన్. వెంకటస్వామి పర్యవేక్షించి వంద రోజుల ప్రణాళికను విజయవంతం చేస్తామని సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్, మెప్మా సీని శ్వేత, ఊర్మిళ, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.