సివిల్ సప్లయీస్ కార్పొరేషన్లో సమ్మె సైరన్ మోగబోతున్నది. మూడు నెలల క్రితం కూలీ పెంచుతామని ఒప్పందం జరిగినా.. నేటికీ అమలు చేయకపోవడంతో కార్మికలోకం ఆందోళనబాట పడుతున్నది. అందుకు సంబంధించి ప్రభుత్వం రేపటిలోగా జీవో ఇవ్వకపోతే జనవరి ఒకటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఇప్పటికే నోటీస్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెళ్తే పౌర సరఫరాలు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.
కరీంనగర్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ నుంచి ప్రతి నెలా ప్రజలకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తుంటారు. సివిల్ సప్లయ్స్ గోదాముల్లో హమాలీలు ప్రతి నెలా రెండు దఫాల్లో ఎగుమతి, దిగుమతి విధులు నిర్వర్తిస్తుంటారు. వ్యాగన్లలో వచ్చిన బియ్యాన్ని చౌక ధరల దుకాణాలకు తరలించడంలో కీలకంగా ఉంటారు. గోదాములకు వాచ్మెన్లు కూడా పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం వీరికి రెండేళ్ల కోసారి కూలీ పెంచాలి. కానీ, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూలీ రేట్లు పెంచలేదు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు అనేకసార్లు విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో సివిల్ సప్లయ్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఎదుట రెండు దఫాల్లో చర్చలు నడిచాయి.
ఎట్టకేలకు అక్టోబర్ 4న పలు యూనియన్ల సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. అప్పటి వరకు ప్రతి క్వింటాల్‌కు 26 కూలీ చెల్లించేది. అదనంగా 3 కలిపి 29 చెల్లిస్తామని కమిషనర్ అంగీకరించినా.. నేటి వరకు ఈ ఒప్పందాన్ని అమలు చేయలేదు. ఒప్పందం అయిన వెంటనే ఇవ్వాల్సిన జీవోనే ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో హమాలీ కార్మికులు పలు సార్లు విజ్ఞప్తులు చేశారు. అయినా స్పందన లేకపోవడంతో ఆందోళన బాట పడుతున్నారు. ఈ నెల 18న కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఒప్పందం ప్రకారం పెంచిన కూలీ రేట్లను అమలు చేయకపోవడంతో జనవరి ఒకటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని నోటీస్ కూడా ఇచ్చారు. జిల్లా స్థాయిలో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ నేతృత్వంలో జిల్లా అధికారులకు సైతం సమ్మె నోటీస్ ఇచ్చారు.
సమ్మెకు వెళ్తే సేవలకు ఆటంకం
రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా ఒకటి నుంచి 10 వ రకు గోదాముల ద్వారా చౌకధరల దుకాణాలకు బి య్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. హమాలీలు జనవరి ఒకటి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తే సంస్థ సేవలకు ఆటంకం ఏర్పడుతుంది. చౌక ధరల దుకాణాలకు బియ్యం సరఫరా అయ్యే పరిస్థితి ఉండదు. దీంతో రాయితీ బియ్యంపై ఆధారపడిన నిరుపేదలకు పూట గడవడం కష్టంగా మారుతుంది. అంతే కాకుం డా ప్రతి నెలా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం కోసం అందించే బియ్యం సరఫరా కూడా నిలిచి పోతున్నది. దీంతో విద్యార్థులు ప స్తులు ఉండాల్సిన దుస్థితి వస్తుంది.
ఈ నేపథ్యంలో డిసెంబర్31 వరకు తమకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, కూలీ పెంచుతున్నట్టు జీవో విడుదల చేయాలని హమాలీ కార్మికులు ప్రధానంగా కార్మికులు డి మాండ్ చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం రెండు జతల బట్టలు, అందుకు కుట్టుకూలీ కూడా ఇవ్వాల ని, ఈఎస్ఐ దవాఖానల్లో వైద్య సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతే కాకుండా గోదాములు అద్దె భవనాల్లో నిర్వహించడం వల్ల భారం ప డుతున్నదని, కార్పొరేషన్‌కు సంబంధించిన స్థలాల్లో పక్కా గోదాములు నిర్మించాలని, రహదారులకు ఆనుకొని ఉన్న స్థలాల్లో పెట్రోల్ బంకులు, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
పెంచిన కూలీ అమలు చేయాలి
సివిల్ సప్లయీస్ కార్పొరేషన్లో పనిచేసే హమాలీలకు రెండేళ్లకోసారి కూలీలు పెంచాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ సారి అలా చేయకపోవడంతో అనేక సార్లు ధర్నాలు, ఆందోళనలు చేశాం. చివరకు కార్పొరేషన్ కమిషనర్ వద్ద రెండు దఫాలు చర్చలు జరిగాయి. ఇప్పుడు కూలీ 26 ఉండగా 3 పెంచుతామని ఒప్పుకొన్నారు. అక్టోబర్ 4న జరిగిన ఒప్పందం మేరకు మూడు నెలలుగా ప్రతి క్వింటాల్‌కు 29 చెల్లించాలి. కానీ, ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో ఆందోళనబాట పట్టాల్సి వస్తున్నది. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో జనవరి ఒకటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని నోటీసు ఇచ్చాం. రేపటిలోగా జీవో ఇస్తే సమ్మె విరమించుకుంటాం. లేదంటే సమ్మె తప్పదు. మా కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 187 గోదాముల పరిధిలోని 3,600 మంది హమాలీలు, నైట్ వాచ్మెన్లు, మహిళా హమాలీలు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. అన్ని గోదాముల ఎదుట శిబిరాలు ఏర్పాటు చేసి, ధర్నాలు నిర్వహిస్తాం.
– టేకుమల్ల సమ్మయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి