గంగాధర, ఫిబ్రవరి 25: విద్యార్థులు ప్రణాళికతో చదివి రానున్న 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సురభి పాఠశాల కరస్పాండెంట్ చిప్ప వీరేశం అన్నారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని సురభి పాఠశాలలో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు(Farewell party) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి కన్నవారికి, ఉన్న ఊరికి, పాఠశాలకు పేరు తేవాలని సూచించారు.
విద్యతోనే ప్రతి మనిషికి సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. సరైన విద్యా విధానంపైనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు బాగా చదవి సమాజ అభ్యున్నతికి పాటుపడాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చెప్ప వీర నరసయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.