Dharmaram | ధర్మారం, డిసెంబర్27: బాల్య వివాహాలతో ఎన్నో అనర్థాలు సంభవిస్తాయని ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్యవివాహాలు చేయవద్దని జిల్లా మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ దయా అరుణ అన్నారు. ఈ మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామం లోని అంగన్ వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక అభ్యాసనం కార్యక్రమం, బాల్యవివాహాల నిషేధ చట్టం -2006 పై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా మహిళా సాధికారిక కోఆర్డినేటర్ అరుణ మాట్లాడుతూ బాల్య వివాహా నిషేధ చట్టం 2006 గురించి వివరిస్తూ ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేస్తే దానివలన వల్ల మానసిక, శారీరక అనర్థాలు సంభవిస్తాయని ఆమె వివరించారు. బాల్య వివాహం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలని ఆమె సూచించారు.
బాల్య వివాహాలు జరిపిస్తే తమకు సమాచారం అందించాలని ఆమె కోరారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ సేవలు, మహిళా హక్కుల గురించి ఆమె వివరించారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు చేస్తే తమ శాఖకు సమాచారం అందించాలని ఆమె కోరారు. అనంతరం తల్లులు, పిల్లల బరువు తూకం చేసి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు రాజు నాయక్, అంగన్వాడీ సూపర్వైజర్ కె. బ్లాండినా, అంగన్వాడీ టీచర్లు కె. మంగ రాణి, బి .రేణుక, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.