సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) నూతన పాలకవర్గం మంగళవారం ఏర్పాటైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో పదవుల కేటాయింపుల్లో సముచిత స్థానం లభించింది. ఇదివరకే చైర్మన్‌గా పనిచేసిన అనుభవమున్న చిక్కాల రామారావుకే మరోసారి అవకాశం కల్పించగా, ఆది నుంచీ పార్టీలో ఉండడంతోపాటు రెండోసారి డైరెక్టర్‌గా గెలిచిన దేవరకొండ తిరుపతికి వైస్ చైర్మన్ పీఠం దక్కింది. సెస్ చరిత్రలోనే మొదటిసారిగా విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన తిరుపతికి పదవిని కట్టబెట్టగా, ఆ వర్గం ఆనందంలో మునిగిపోయింది. మొత్తంగా అభ్యర్థుల ఎంపికలో కేటీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. వరుసగా నాలుగోసారి గులాబీ జెండా ఎగురవేయగా, శ్రేణుల్లో సంబురం అంబరాన్నంటింది.
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడి కాగా, బీఆర్ఎస్ బలపరిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 15 డైరెక్టర్ స్థానాలకు 15 కైవసం చేసుకొని క్లీన్‌స్వీప్ చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని సెస్ కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు డైరెక్టర్లందరూ కార్యాలయానికి చేరుకోగా, సమావేశ మందిరంలో ఎన్నికల అధికారి మమత ఎన్నికలను నిర్వహించారు. సభ్యులందరికీ నామినేషన్ల పత్రాలు అందించారు. చైర్మన్ పదవికి తంగళ్లపల్లి మండలం నుంచి డైరెక్టర్‌గా గెలిచిన చిక్కాల రామారావు, వైస్ చైర్మన్ పదవికి కోనరావుపేట మండలం నుంచి డైరెక్టర్‌గా గెలుపొందిన దేవరకొండ తిరుపతి తమ నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి మమత వెల్లడించారు. రెండు స్థానాలకు ఒక్కో నామినేషన్ రావడంతో చైర్మన్‌గా చిక్కాల రామారావు, వైస్‌చైర్మన్‌గా దేవరకొండ తిరుపతి ఎన్నికైనట్లు ప్రకటించారు.
చైర్మన్ చిక్కాల రామారావు, వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతిని అభినందిస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, చిత్రంలో జోగినపల్లి రవీందర్రావు
సముచిత స్థానం
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ సభ్యులందరూ అధిష్టానం ఆదేశాలను శిరసా వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించిన అభ్యర్థులనే చైర్మన్, వైస్చైర్మన్లుగా ఎన్నుకుని బీఆర్ఎస్ క్రమశిక్షణకు పెట్టింది పేరని నిరూపించారు. 2007లో చైర్మన్‌గా పనిచేసిన చిక్కాలకు సెస్‌పై అవగాహన ఉన్నందున మరోసారి ఆయనకే చైర్మన్ పదవిని కట్టబెట్టారు. కాగా, 2016 ఎన్నికల్లో కోనరావుపేట స్థానం నుంచి డైరెక్టర్‌గా గెలిచిన దేవరకొండ తిరుపతికి ఈసారి వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. విశ్వబ్రహ్మణుడైన తిరుపతికి వైస్‌చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆ సామాజిక వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అభినందనల వెల్లువ
నూతన పాలకవర్గానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. చైర్మన్‌గా చిక్కాల రామారావు, వైస్‌చైర్మన్‌గా దేవరకొండ తిరుపతి ఎన్నికైన అనంతరం బాధ్యతలు చేపట్టారు. వీరిని ఎన్నికల అధికారి మమత, సెస్ ఎండీ రామకృష్ణ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకెరవిశంకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, ఆర్బీఎస్ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ అభినందించారు. చిక్కాల రామారావుతోపాటు ఆయన విజయంలో కీలకంగా కృషి చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావును జిల్లా వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
విజయోత్సవ ర్యాలీ
సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 27 : బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో సెస్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీ తీశారు. ప్రత్యేక వాహనంపై అభ్యర్థులు భారీ ఊరేగింపుతో స్థానిక సెస్ కార్యాలయం నుంచి నేతన్న విగ్రహం వరకు వెళ్లారు. దారిపొడవునా నాయకులు, కార్యకర్తలు నృత్యాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా సెస్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానిక గాంధీ, అంబేద్కర్, నేతన్న విగ్రహాలకు పూలమాలలు వేశారు.
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
సెస్ డైరెక్టర్‌కు సన్మానం
బోయినపల్లి, డిసెంబర్ 27: కర్షకుల (రైతుల) అభ్యున్నతికి కృషి చేయాలని సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్‌ను కోరారు. మంగళవారం సిరిసిల్ల సెస్ కార్యాలయంలో సుధాకర్‌ను ఎమ్మెల్యే రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి ప్రేమ్‌సాగర్‌రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి శాలువా, పూలమాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పని చేయాలని, వారికి నిరంతరం అందుబాటులో ఉండి వెన్నుదన్నుగా నిలువాలని చెప్పారు. ప్రభుత్వం రైతులకు అందించే విద్యుత్ రాయితీలు ప్రతి రైతుకు చేరేలా కృషి చేయాలన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మండల రైతుబంధు సమితి కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారయణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ఉన్నారు.