గోదావరిఖని, ఫిబ్రవరి 11: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ఈ నిర్ణయం కార్మికుల పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నది. రామగుండంలో సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం అభినందనీయం. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య ప్రధాతగా నిలిచిన ఆయనకు నా కృతజ్ఞతలు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కాలేజీకి సింగరేణి సైన్స్ మెడికల్ కాలేజీగా నామకరణం చేయాలి. కార్మికుల పిల్లలకు ప్రత్యేక కోటాను అందించాలి.
కార్మికులకు వైద్యానికి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలి. అలాగే క్వార్టర్లలో నివాసముంటున్న కుటుంబాలకు భగీరథ నీటిని సరఫరా చేయాలి. ఖాళీ క్వార్టర్లను శాశ్వతంగా కార్మికులకు కేటాయించాలి. సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న వారికి జీవో నం.76, 58 ప్రకారం పట్టాలు ఇప్పించాలి. కుందనపల్లిలోని ఎన్టీపీసీ యాష్‌ప్లాంట్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాలి.
రామగుండంలో మైనింగ్ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. పాలకుర్తి, అంతర్గాం మండలాలకు జూనియర్ కళాశాలలను మంజూరు చేయాలి. పెద్దంపేట పెద్ద చెరువు కింద 4వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ చెరువులో ఎన్టీపీసీ యాష్‌పాండ్ నీళ్లు ఉండడంతో సాగుకు ఉపయోగపడడం లేదు. ప్రభుత్వం లింగాపూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చెరువును నీళ్లతో నింపితే రాయదండి, పాముల పేట, లింగాపూర్, పెద్దంపేట పరిధిలో 4వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
– అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్