కోడికూర కొండెక్కుతున్నది. చికెన్ ముక్క నోటికి అందనంటున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో ధర అమాంతం పెరిగింది. ఫిబ్రవరి నుంచే ఎగబాకుతుండగా.. ప్రస్తుతం రికార్డు స్థాయిలో 380 నుంచి 400 చేరింది. నెల రోజుల్లోనే 150పైనే పెరగ్గా, కిలో కొనేవారు అర కిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తున్నది. అయితే వాతావరణంలో హెచ్చు తగ్గులను కోళ్లు తట్టుకోలేకపోతుండడం, పెరిగీ పెరగక ముందే చనిపోతుండడమే డిమాండ్‌కు కారణమని తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఎక్కువగా మహారాష్ట్ర నుంచి జిల్లాకు దిగుమతి అవుతుండగా.. ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ దెబ్బతిని గుడ్ల ధరలు మాత్రం ఒక్కసారిగా పడి పోయాయి.
కరీంనగర్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : చికెన్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వేసవిలో వాతావరణంలో హెచ్చు తగ్గులు వస్తున్న కారణంగా బాయిలర్ కోళ్లు వ్యాధుల బారిన పడుతున్నాయి. ఈ కారణంగా రైతులు బాయిలర్ కోళ్ల పెంపకానికి ముందుకు రావడం లేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలా 30 లక్షల బాయిలర్ కోళ్లు రిప్లేస్మెంట్ జరుగుతుంది. కానీ, బాయిలర్కోడి పిల్ల ధర 60కి పెరిగింది. అయినా భరించి రిప్లేస్మెంట్ చేసుకుంటే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అవి బతకడం లేదు.
అంతే కాకుండా వేసిన పిల్లలు గ్రోతింగ్ కూడా రావడం లేదు. సాధారణంగా రెండు నుంచి రెండున్నర, మూడు కిలోలు పెరిగే లైవ్ బర్డ్ ప్రస్తుతం కిలోన్నర, కిలో 900 గ్రాములు మాత్రమే పెరుగుతున్నది. ఈ కారణంగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ మంది బాయిలర్ రైతులు కోడి పిల్లలు పెంచడానికి ముందుకు రావడం లేదు. సాధారణ సమయాల్లో ప్రతి నెలా 25 లక్షల వరకు కోళ్లు పెంచినా.. ప్రస్తుతం 12 లక్షలు, అంతకంటే తక్కువ కోళ్లనే పెంచుతున్నారు. ఫలితంగా జిల్లాకు మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల నుంచి బాయిలర్ కోళ్లను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో డిమాండ్‌కు సరిపడా అందకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తున్నది. ఈ కారణంగానే రవాణా చార్జీలు అదనపు భారంగా మారి చికెన్ ధరలు అమాంతం పెరిగాయని స్పష్టంగా తెలుస్తున్నది.
పడిపోయిన గుడ్డు ధర
ఓవైపు చికెన్ ధరలు ఆకాశన్నంటుతుండగా.. గుడ్ల ధరలు మాత్రం అమాంతం పడిపోయాయి. లేయర్ రైతులు విపరీతంగా నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం పది రోజుల కింద గుడ్డు ట్రేడింగ్ ధర 6.50 నుంచి 7 ఉండేది. రిటైల్‌లో 8 వరకు ఒక గుడ్డు అమ్మేది. కానీ, ఇప్పుడు ట్రేడింగ్ ధర 3.60 మాత్రమే ఉన్నది. లేయర్ రైతులు ట్రేడింగ్ ధరపై 30 పైసలు తగ్గించి ఇచ్చినా కొనే వారు కనిపించడం లేదు. యుద్ధం కారణంగా ఇతర దేశాలకు ఎగుమతులు పడిపోవడంతో స్థానికంగానే అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, డిమాండ్ కంటే ఎక్కువ గుడ్లు మార్కెట్లో నిలువకు ఉండడంతో కొనేవారు కరువయ్యారు. గతంలో 180 నుంచి 190కి అమ్మిన ట్రే ఇప్పుడు 100 కూడా పలకడం లేదు. దీంతో లేయర్ రైతులు నష్టాలను చవి చూడాల్సి వస్తున్నది. ధరలు లేక పోవడంతో కొందరు రైతులు గుడ్లను లోడ్లకు లోడ్లు పార బోస్తున్నారు. దీంతో ఫౌల్ట్రీ పరిశ్రమలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ఒక పక్క బాయిలర్ కోళ్లు అందుబాటులో లేక చికెన్ ధర విపరీతంగా పెరుతుంటే మరో పక్క అంతర్జాతీయ మార్కెట్ లేక లేయర్ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Eggs Chickens
ధర పెరిగినా తగ్గడి డిమాండ్
నిజానికి ఫిబ్రవరి నెలాఖరు నుంచే చికెన్ ధర పెరుగుతూ వస్తున్నది. బాయిలర్ కోళ్ల పెంపకం తగ్గిన కొద్దీ ధర పెరుగుతున్నది. ఫిబ్రవరిలో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర 230 ఉంటే ఇప్పుడు 380 నుంచి 400కి చేరింది. కరీంనగర్ నగరంలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధరకు విక్రయిస్తున్నారు. జగిత్యాల, గోదావరిఖని వంటి ప్రాంతాల్లో 400పైనే అమ్ముతున్నారు. ఆదివారంతోపాటు పండుగ రోజుల్లో అయితే మరింత ధర పెంచుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజూ 16 నుంచి 17 టన్నుల చికెన్ విక్రయిస్తున్నారు. పండుగలు, ఫంక్షన్ల సమయంలో ఇది మరింత పెరుగుతున్నది. ప్రస్తుతం ఈ డిమాండ్ మేరకు జిల్లాలోగానీ, చుట్టుపక్కల ఇతర జిల్లాలోగానీ బాయిలర్ కోళ్లు లేకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అయినా జిల్లాలో మాత్రం ధర పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గడం లేదని చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. తమకు మాత్రం లాభాలు ఉండడం లేదని వాపోతున్నారు. గతంలో కిలో చికెన్ అమ్మితే 60 నుంచి 70 వరకు మిగిలేదని, ఇప్పుడు 30 నుంచి 40 మాత్రమే మిగులుతున్నదని చెబుతున్నారు. చికెన్ ధర పెరిగినా తినక తప్పని పరిస్థితి ఉందని మరో పక్క వినియోగదారులు అంటున్నారు.
సేల్స్ ఉన్నా ప్రాఫిట్ లేదు
చికెన్ ధర పెరిగినా సేల్స్ ఎక్కడా తగ్గ లేదు. ధర పెరిగినా ఎప్పటిలాగే చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నుంచే చికెన్ ధరలు పెరుగుతున్నాయి. గత నెల 22న కిలో చికెన్ 230కి అమ్మిన. ఈ నెల 8న అదే ధర 330కి చేరింది. నిన్నటి ఆదివారం కాస్త స్కిన్ లెస్ 380కి అమ్మిన. కొన్ని సెంటర్లలో 400 కూడా అమ్మారు. ధర ఇంత పెరిగినా సేల్స్ మాత్రం ఎక్కడా తగ్గ లేదు. అయినా మాకు మాత్రం ప్రాఫిట్ ఉంటలేదు. గతంలో కిలో చికెన్ మీద 60-70 మిగిలేవి. ఇప్పుడు మాత్రం 30-40 మాత్రమే మిగులుతున్నవి.
– శ్రీకాంత్, చికెన్ సెంటర్ నిర్వాహకుడు
ధర పెరిగినా తినక తప్పదు
చికెన్ ధర విపరీతంగా పెరిగింది. మాంసం ప్రియులకు వారంలో ఒక రోజైనా చికెన్ లేకుంటే ముద్ద దిగదు. ధరలు పెరిగినా కొనక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితిలో 400 కిలో పెట్టి చికెన్ తీసుకునే కంటే అదే ధరతో అరకిలో మటన్ వస్తుందని చూసే వాళ్లు కూడా ఉంటారు. కానీ, చాలామంది ఇండ్లలో పిల్లలు చికెన్‌కు అలవాటు పడి ఉన్నారు. అందుకే చికెన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు భారమే. అయినా వారంలో ఒక రోజు తప్పకుండా తింటున్నారు.
లేయర్ రైతులకు విపరీతమైన నష్టం
గుడ్లు అమ్మక లేయర్ రైతులు విపరీతంగా నష్టపోతున్నరు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ దెబ్బతిన్నది. వారం పది రోజుల్లోనే గుడ్డు ధర విపరీతంగా పడిపోయింది. అయినా కొనే వారు లేకుండా పోయిన్రు. లేయర్ రైతుల నుంచి తక్కువ ధరకు కొంటున్న దళారులు మాత్రం గుడ్డు ధర నామమాత్రంగా తగ్గించి రిటైల్‌లో అమ్ముతున్నరు. గతంలో ట్రేడింగ్ ధర గుడ్డు ఒక్కటికి 6.50 నుంచి 7 వరకు ఉండేది. ఇపుడు ట్రేడింగ్ ధర 3.60కి తగ్గింది. 30 పైసలు తగ్గించి ఇస్తున్నం. ఈ ధరపై 50 పైసలు చూసుకుని రిటైల్‌లో అమ్మితే సేల్స్ ఎక్కువగా ఉండేది. కానీ, పాత ధరపై నామమాత్రంగా విక్రయిస్తున్నరు. మార్కెట్లో డిమాండ్‌కు మించి గుడ్ల నిలువలు ఉంటున్నయి. ఫలితంగా అమ్మకాలు జరగడం లేదు. చాలా మంది రైతులు గుడ్లను పడేసే పరిస్థితి వచ్చింది.
– కొత్త అంజిరెడ్డి, లేయర్ రైతు (నుస్తులాపూర్)