Change in society | కోల్ సిటీ, జూలై 6: సందేశాత్మక చిత్రాల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని గోదావరిఖని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఏసీపీ) మడత రమేష్ అన్నారు. తెలంగాణ లైఫ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో రాపల్లి కుమార్ పటేల్ రచన, దర్శకత్వంలో నిర్మిస్తున్న రక్షణ అనే లఘుచిత్రం షూటింగ్ ను గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఆయన ఆదివారం ముఖ్యతిథిగా హాజరై క్లాప్ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ విప్లవం, రౌడీయిజం, చదువు ఈ మూడింటి అంశాలను ఇతివృత్తంగా తీసుకొని తీస్తున్న ఈ చిత్రం ద్వారా కొంతవరకైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. నేటి సమాజంలో యువత మంచి కంటే చెడుకే తొందరగా ఆకర్షితులవుతున్నారని, యువతను సన్మార్గంలో నడిపించేందుకు ఒక పోలీస్ వ్యవస్థతోనే సాధ్యం కాదని, ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నారు. యువత సైతం సమాజ మార్పు కోరుతూ ఇలాంటి లఘుచిత్రాలను తీయాలన్నారు.
అనంతరం సినిమా పోస్టర్ ను ఆవిష్కరించారు. కాగా ఇందులో నటీ నటులుగా రమాకాంత్, దామెర రాజేశ్, వనపర్తి ప్రభాస్, స్వరూపరాణి, నిర్మల, రాజేశ్వరి, చైతన్య రాణి, జక్కుల స్వప్న, సిరిశెట్టి తిరుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు దామెర శంకర్, మేజిక్ రాజా, చంద్రపాల్, దయానంద్ గాంధీ, కొమ్ము కుమార్, మేకల శ్రీకాంత్, పటేల్, ఉపేందర్, విజయ్ కుమార్, వంగ శ్రీనివాస్, బెందె నాగభూషణం, డా. శంకర్ లింగం, కళావతి, మధు తదితరులు పాల్గొన్నారు.