Vemulawada | వేములవాడ, మే 8 : రాజన్న ఆలయ అభివృద్ధి పనుల నివేదికలలో అంత రహస్యం ఏమి ఉందని, ఎందుకంత గోప్యత పాటిస్తున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. వచ్చే జూన్ 15 నుంచి ఆలయాన్ని మూసివేసి అభివృద్ధి చేస్తామని అధికారులు ప్రకటించడం భక్తుల మనోభావాలను కించపరిచినట్లేనన్నారు. పనులు కొనసాగిస్తూనే దర్శనాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. గురువారం వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధిని పూర్తిగా స్వాగతిస్తున్నామని, కానీ పనుల నివేదికలు విడుదల చేయకుండా, కనీసం వేములవాడ పట్టణ ప్రజలు, భక్తులు, ఆఖరికి ఆలయ ఉద్యోగులకు కనపడకుండా ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతున్నారో ప్రభుత్వం, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పాలని ప్రశ్నించారు. నివేదికలు బహిర్గతం చేయాలన్నారు. డీపీఆర్ సిద్ధం చేశారా..? ఎన్ని నిధులు అవసరమో అంచనా వేశా రా..? అని ప్రశ్నించిన ఆయన, పనులను ఎప్పటివరకు పూర్తి చేస్తారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
1979లో ఆలయ పునర్నిర్మాణం జరిగిందని, ఆ తర్వాత బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధికి అడుగులు పడ్డాయని గుర్తు చేశారు. అప్పుడు తాము చేపట్టబోయే పనులు ప్రజలు, భక్తులకు తెలిసేలా ఆలయంలోనే ఛాయాచిత్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని చెప్పారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆలయ అభివృద్ధి విషయంలో గోప్యత ఎందుకు పాటిస్తున్నదో అంతుచికడం లేదన్నారు. ఆలయాన్ని బంద్ చేస్తే, గుడిమీదే ఆధారపడి బతుకుతున్న దాదాపు 5 వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు, భక్తులు, చిరువ్యాపారులకు ఇబ్బంది కలిగితే ఊరుకునేది లేదని, ప్రజల పక్షాన నిలుచుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని, మరి నిధులు లేకుండా ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. సీఎం నవంబర్‌లో ఆలయానికి వచ్చి 76 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని, దాదాపు ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కేటాయించలేదని, డబ్బులు రాకముందే ఇంత హంగామా ఎందుకని మండిపడ్డారు. ఆలయంలోని నగదు ఫిక్స్ డిపాజిట్లు తీసి అభివృద్ధికి వెచ్చించాలనే ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసిందని, అదే జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆలయానికి సంబంధించి 110 కోట్ల ఫిక్స్ డిపాజిట్లు ఉన్నాయని, వాటి ద్వారా వచ్చే వడ్డీతోనే రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయని వివరించారు.
జనరల్ ఫిక్స్డ్ డిపాజిట్లు 20 కోట్లు, మరో 20 కోట్లు నిత్యాన్నదాన సత్రం నిర్వహణకు ఉన్నాయని చెప్పారు. జనరల్ ఫిక్స్ డిపాజిట్లు మినహా ఇతర నగదు డిపాజిట్లు ఏవి కూడా నిబంధనలకు విరుద్ధంగా తీయరాదని వివరించారు. 6.5కోట్లతో చేపట్టిన బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతున్నదని, ముందుగా ఈ పనులు పూర్తిచేసిన తర్వాత రాజన్న ఆలయ అభివృద్ధికి పోతే మంచిదని సూచించారు. వేములవాడ ప్రధాన రహదారి విస్తరణలోను 243 ఇండ్లను భూ సేకరణ ద్వారా సేకరిస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం 315 ఇండ్లను చేర్చడం సరికాదన్నారు. అధికారం ఉంది కదా..! అని ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రజలు క్షమించరన్నారు. సమావేశంలో సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, రామతీర్థపు రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, ప్యాక్స్ చైర్మన్ రామ్మోహన్, మాజీ కౌన్సిలర్లు సిరిగిరి రామ్‌చందర్, గోలి మహేశ్, జోగిని శంకర్, సీనియర్ నాయకులు ప్రసాద్ రావు, నరాల దేవేందర్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మల్లేశం, అంజద్ పాషా, వాసాల శ్రీనివాస్, గుడిసె సదానందం, వెంకట్ రెడ్డి, పోతు అనిల్ కుమార్, చేపూరి రవీందర్, పైడి శ్రీనివాస్, సుంకాపాక రాజు, రవిచంద్ర గౌడ్, కట్ట తిరుపతి, సందీప్, హింగే కుమార్, అసద్, రాకేశ్, అనిల్, ప్రమోద్ ఉన్నారు.