వేములవాడ, ఫిబ్రవరి 14: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా చేపట్టే గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని తన స్వగృహంలో వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ, మహోత్తర కార్యక్రమమైన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మూడు మొక్కలు నాటాలని కోరారు. నాటిన మొక్కతో సెల్ఫీ దిగి పంపాలన్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పనిసరిగా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొస్కుల రవి, మాజీ కౌన్సిలర్లు శేఖర్, విజయ్, మహేశ్, మాజీ సర్పంచ్ మల్లేశం, నాయకులు ఈర్లపల్లి రాజు, క్రాంతి, శంకర్, కృపాల్, తదితరులు పాల్గొన్నారు.