కరీంనగర్ రూరల్, అక్టోబర్ 9 : బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన కేసీఆర్ కిట్ స్ఫూర్తితో చల్మెడ ఆనందరావు వైద్యశాలలో ఈ నెల 9 నుంచి పుట్టిన ప్రతి బిడ్డకూ చల్మెడ బేబీ కిట్‌ను అందిస్తున్నామని చల్మెడ ఆనందరావు వైద్యకళాశాల, వైద్యశాల చైర్మన్ చల్మెడ లక్ష్మీనర సింహారావు తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధి బొమ్మకల్‌లోని చల్మెడ వైద్యశాలలో గురువారం వైద్య కళాశాల డైరెక్టర్ వీ సూర్యనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ అసీం అలీ, సూపరింటెండెంట్ డీవీ రామకృష్ణ ప్రసాద్, ఓబీజీ హెచ్‌వోడీ వీ రమాదేవి, డాక్టర్ మాధవితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పలువురు డెలివరీ జరిగిన మహిళలకు చల్మెడ బేబీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ, మహిళలు గర్భందాల్చిన మొదటి నెల నుంచి సాధారణ, సిజేరియన్ ద్వారా బిడ్డ పుట్టే వరకు ప్రతి నెలా అవసరమైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తామని తెలిపారు. అలాగే ప్రతి బిడ్డకూ చల్మెడ బేబీ కిట్ అందిస్తామని, పుట్టిన బిడ్డలకు ఒక నెల వరకు టీకాలు, అవసరమైన వ్యాక్సినేషన్ ఉచితంగా వేస్తారని చెప్పారు.
కరీంనగర్ జిల్లాలోని గర్భిణులు ఈ సదుపాయలను వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటి వరకు తమ వైద్యశాలలో 200 మంది వరకు రిజిస్టర్ అయ్యారని చెప్పారు. చల్మెడ బేబీ కిట్‌లో బేబీ సోప్, దోమ తెర బెడ్, టీకా, చేతులకు బ్లౌస్‌లు, రెండు డ్రెస్‌లు, పౌడర్, మెడిసిన్స్, రెండు క్యాప్‌లు, రెండు టవల్స్, ఆయిల్ బాటిల్, పాల పీకా, పిల్లలకు పట్టించే బలవర్ధకమైన పౌడర్ వంటివి ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కవిత, హరుజుమాద్ భాను, ప్రశాంత్ శ్రావణ్, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.