వేములవాడ, డిసెంబర్ 16: ‘విప్ ఆది శ్రీనివాస్‌కు ఫొటోలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై, భక్తుల మనోభావాలపై లేదు’ అని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు మండిపడ్డారు. రాజన్న కోడెలు కోతకు వెళ్లిన వ్యవహారంలో ఆయన మౌనం తప్పునకు అంగీకారమేనా.. అని ప్రశ్నించారు. గతంలో రైతులకు ఇచ్చామన్న 1,734 కోడెలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఇప్పటికైనా ఆయన నోరు విప్పాలని, నిజానిజాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి చిన్న విషయానికి సమావేశాలు పెట్టి ప్రతిపక్షాలను విమర్శించే ఆది శ్రీనివాస్, రాజన్న కోడెలు కబేళాలకు తరలిస్తున్నా, సాక్షాత్తూ మంత్రి కొండా సురేఖ అనుచరులకు కట్టబెట్టిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినా ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు.
వరంగల్ జిల్లా గీసుకొండ పరిధిలోని ముగ్గురికి 33మంది రైతుల పేరిట పంపిణీ చేసిన 66 కోడెల వ్యవహారంపై బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 66 కోడెలలో 28 జీవాలను కబేళాలకు అమ్మడం చాలా బాధాకరమన్నారు. అక్కడి నుంచి 26 కోడెలను తిరిగి రాజన్న గోశాలకు తీసుకువచ్చారని, ఈ విషయాన్ని ఆలయ అధికారులు గోప్యంగా ఉంచడం అనేక సందేహాలకు తావిస్తున్నదన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు నిందితులను జైలుకు పంపినా, దీనిపై శ్రీనివాస్ నోరుమెదపక పోవడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రాజన్న ఆలయానికి సాలినా ఏటా రూ.119 కోట్ల ఆదాయం వస్తున్నా, అందులో కోడె మొక్కుల నుంచే రూ.22కోట్లు సమాకూరుతున్నా కోడెల సంరక్షణకు ఏడాదికి రూ.2కోట్లు మాత్రమే వెచ్చించడం బాధాకరమన్నారు. ఈ రైతులకు పంపిణీ చేసిన కోడెల జాబితాను పోలీసులకు అందజేసి కేసు పెడతామని చెప్పిన ఆలయ ఈవో, ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో చెప్పాలన్నారు.
రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకనే ఆయన సెలవులో వెళ్లారని ఆరోపించారు. ఆలయ పాలన గాడి తప్పిందని, భక్తులకు సంపూర్ణ సేవలందడం లేదని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం వేములవాడ పర్యటన సందర్భంగా వంద మంది వీఐపీల భోజనాలకు 32లక్షలు బిల్లు చేశారని, అంటే ఒక్కో ప్లేటుకు 32 వేలు ఖర్చు చేయడం ఎక్కడా చూడలేదన్నారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇంత మొత్తంలో ఖర్చుకాలేదన్న ఆయన, సదరు బిల్లులతోపాటు ఇతర ఖర్చులు మొత్తం 2కోట్లను రాజన్న ఆలయం నుంచి చెల్లింపులు చేయాలని చెప్పడం సరికాదన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికోసం 72 కోట్లు తెచ్చామని అంటున్నారని, అందులో ఒక్క రూపాయి అయినా డిపాజిట్ అయిందా అని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేశ్, నరాల శేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు గోస్కుల రవి, నాయకులు పొలాస నరేందర్, తీగల రవీందర్‌గౌడ్, వెంగల శ్రీకాంత్‌గౌడ్ తదితరులు ఉన్నారు.