Chakali Ailamma | పెద్దపల్లి, సెప్టెంబర్26: వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు ఆర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ సంఘ సేవకురాలుగా, భూమి, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాట పటిమతో వీర వనితగా చరిత్రలో నిలిచి, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచి, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అటువంటి వీర వనితను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, రజక సంఘ నాయకులు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.