Chakali Ailamma | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 10 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ రోడ్డు చౌరస్తాలో గల ఐలమ్మ విగ్రహానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అనగారిన వర్గాల హక్కుల సాధన కోసం చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ఒక నిదర్శమని అన్నారు. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. తన హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని కొనియాడారు.
సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని, ఆమె ఆశయాల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాష్, రజక సంక్షేమ సంఘాల నాయకులు కొత్తకొండ రాజయ్య, రాచకొండ నరేష్, కొత్తకొండ శ్రీనివాస్, పూసాల శ్రీకాంత్, పున్నం శ్రీనివాస్, రామడుగు సంపత్, పూసాల సంపత్, జంగాలపల్లి శంకర్, గూడ లక్ష్మి, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.