కమాన్చౌరస్తా, జూన్ 15 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని విద్యార్థులు తమ కాళ్లపై తాము నిలిచేలా వారికి అవగాహన కల్పిస్తూ, సంపూర్ణ వికాసానికి తోడ్పాటునందించడమే తమ విద్యాసంస్థల లక్ష్యమని వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వివేకానంద స్కూల్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థుల శరీరం, మెదడు, మనసు, హృదయం అభివృద్ధి చెందేలా వారికి అవసరమైన శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. నూతన విద్యాసంవత్సరం ఆరంభాన్ని పురస్కరించుకుని వివేకానంద విద్యాసంస్థల పనితీరుపై ఆయన సమగ్ర విశ్లేషణ చేశారు. తమ విద్యా సంస్థల్లో చదివిన వేలాది మంది ఉన్నత విద్యావంతులుగా ఎదిగారని, అనేక రంగాల్లో స్థిరపడ్డారని వివరించారు. తమ పిల్లలను ఇంటిలో పెంచే విధానంపై తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వడం తమ విద్యా సంస్థల ప్రత్యేకత అని వెల్లడించారు. విద్యార్థులు స్ఫూర్తి పొందేలా ప్రతి శనివారం సాయంత్రం వీకెండ్ విత్ ఎక్స్పర్ట్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ చిన్నారుల్లో చైతన్య బీజాలు నాటుతున్నామని చెప్పారు.
విద్యార్థి దశ నుంచే సామాజిక పరిజ్ఞానం పెంపొందిస్తున్నామన్నారు. ప్రజల జీవనం, వారి ఆలోచన విధానం తెలుసుకునేలా, పాఠ్యపుస్తకాల్లోని 76 అంశాలపై గ్రామదర్శిని అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేపడుతామని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, పోషణ, సీజనల్ వ్యాధులపై విద్యార్థుల్లో అవగాహన పెంచుతూ, హెల్త్ బేసిక్స్ నేర్పిస్తున్నామన్నారు. తోటి విద్యార్థులతో కలిసి మెలసి ఉండేలా వారికి ఆవాస నిద్ర కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.