Chada Venkata Reddy | చిగురుమామిడి, ఆగస్టు 23: సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం మృతి చెందగా, వారి కుటుంబాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హైదరాబాదులోని వారి నివాసంలో సురవరం సుధాకర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి, కుమారుడు కపిల్ ను శనివారం పరామర్శించారు. 1960 లో ఏఐ ఎస్ఎఫ్ నుండి అంచలంచెలుగా జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారని అన్నారు. నల్లగొండ ఎంపీగా నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాడని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. తన జీవితకాలం కమ్యూనిస్టు పార్టీకి కృషి చేశాడని, తెలంగాణ ఉద్యమ సమయం, పార్టీలో వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సురవరం మృతి సీపీఐ పార్టీకి తీరనిలోటని, గొప్ప కమ్యూనిస్టు యోధుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి సీపీఐ అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. వీరి వెంట సీపీఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు, సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి ఉన్నారు.