కరీంనగర్ తెలంగాణచౌక్, సెప్టెంబర్ 01 : సీఎం రేవంత్‌రెడ్డి పాలనతో అధికారుల్లో జవాబుదారీతనం లోపించిందని సీపీఐ సీనియన్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారులు బాధ్యతలను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి నిరోధక శాఖ దాడుల్లో వందల కోట్ల రూపాయలు బయట పడుతుండడం చూస్తే ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో లంచాలు తీసుకుంటున్నారంటే అధికారులకు పాలకుల భయం లేకుండా పోయిందన్నారు. సీఎం చొరవ తీసుకొని అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రం ఎడారిగా మారుతున్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రైతుకుల ఉపశమనం కలిగిందని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయలేని కేంద్ర ప్రభుత్వం తన అనుకూల కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ బకాయిలను మాఫీ చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అదివాసి, దళిత మహిళల మీద దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఢిల్లీలో ఆదివాసీ మహిళపై బస్సులోనే లైంగికదాడి చేశారని ఆవేదనవ్యక్తం చేశారు. 22ఏ లోని భూములను పేదలకు పంపిణీ చేసి పట్టాలను అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్‌కుమార్, బోయిని అశోక్, సమ్మయ్య, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.