పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొర్రీలు పెడుతున్నది. ఇప్పటికీ నిబంధనల ప్రకారం పత్తి రావడం లేదని పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేయకుండా చోద్యం చూస్తున్నది. అంతేకాకుండా, నోటిఫై చేసిన మిల్లులపై ఆంక్షలు విధిస్తున్నది. పైగా రోజురోజుకూ నిబంధనలు కఠినతరం చేయడంతో చివరకు కొనుగోళ్లు చేయలేమని సోమవారం జిన్నింగ్ మిల్లర్లు చేతులెత్తేశారు. విషయం తెలియకుండా మిల్లులకు పత్తితో వచ్చిన రైతులు, పొద్దంతా పడిగాపులుగాశారు. వీరి బాధలు చూడలేక మధ్యాహ్నం తర్వాత ఒక్క ఎలబోతారంలో కొనుగోలు చేసినా.. మిగతా చోట్ల కొనకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు మిల్లర్లు, సీసీఐ అధికారుల మధ్య సయోధ్య కుదరడంతో మంగళవారం నుంచి కొనుగోళ్లు పునఃప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. అయితే, ఇప్పటి వరకు కొనుగోళ్లలో ప్రైవేట్ వ్యాపారులదే పైచేయి కాగా, కనీస మద్దతు ధర దక్కక రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఇప్పటికైనా సీసీఐ చొరవ చూపి మద్దతు ధరతో కొనేలా చూడాలని కోరుతున్నారు.
కరీంనగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ రూరల్ : కరీంనగర్ జిల్లాలో గత వానకాలం సీజన్లో 42,730 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ లెక్కన 3,84,570 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. ఎప్పటిలాగే జిల్లాలోని జమ్మికుంటలో 7, కరీంనగర్లో 3, చొప్పదండి, గంగాధర మార్కెట్ల పరిధిలో ఒక్కోటి చొప్పున మొత్తం 12 జిన్నింగ్ మిల్లులను సీసీఐ నోటిఫై చేసింది. సీసీఐ నిబంధనల ప్రకారం అన్ని కేంద్రాల్లో ఒకేసారి కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉన్నది. కానీ, ఇప్పటి వరకు కేవలం మూడు కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరిపింది. ఎన్నడూ లేని విధంగా సీసీఐ అధికారులు కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చారు. మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ఎల్-1, ఎల్-2, ఎల్-3 పేరిట విడదీశారు. ఎల్-1 పరిధిలో ఉన్న మిల్లుల్లోనే ముందుగా కొనుగోళ్లు జరపాలని, మిగతా కేంద్రాలు మూసివేయాలని ఆంక్షలు విధించారు. నిజానికి జిన్నింగ్ కోసం మిల్లర్ల నుంచి ముందుగా సీసీఐ అధికారులు టెండర్లు పిలుస్తారు. ఎప్పటిలాగే ఈసారి టెండర్లు పిలిచినప్పుడు మిల్లర్లు 1,450 నుంచి 1,520కి ఒక బేలు చుట్టేందుకు టెండర్లు వేశారు. వీటిని పరిశీలించిన సీసీఐ అధికారులు 1,345 మాత్రమే ఇస్తామని స్పష్టం చేయడంతో అంగీకరించారు. అయితే ఈ నిబంధనలు అమలులో ఉండగానే కొత్తగా ఎల్-1, ఎల్-2,ఎల్-3 ఎందుకు తేవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కొత్త నిబంధనల ప్రకారం ఎల్-1 మిల్లులు తమకు సరిపడా పత్తి కొన్న తర్వాత ఎల్-2, ఎల్-3 మిల్లులు దశల వారీగా కొనుగోళ్లు జరపాల్సి ఉండగా, దీనిని మూకుమ్మడిగా వ్యతిరేకించారు. అన్ని మిల్లుల్లో ఒకేసారి కొనేందుకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ చేశారు. జిల్లా మార్కెట్ అధికారులు కూడా పది రోజుల కిందనే సీసీఐ అధికారులకు ఒక లేఖ కూడా రాశారు. కానీ, సీసీఐ దిగి రాకపోవడంతో సోమవారం కొనుగోళ్లు నిలిపేశారు.
రైతులపై భారం
సీసీఐ నిబంధనల ప్రకారం చూస్తే రైతులపైనా భారం ఉండనున్నది. ఉదాహరణకు గంగాధర మార్కెట్ పరిధిలోని రైతులకు రామడుగు మండలం గోపాల్రావుపేట మార్కెట్ యార్డు పరిధిలోని వెలిచాలలోని ఓ జిన్నింగ్ మిల్లులో విక్రయించుకోవాల్సి ఉంటుంది. ఈ మిల్లు ఎల్-1 పరిధిలో లేకుంటే సీసీఐ చెప్పేంత వరకు కొనలేరు. కరీంనగర్ మార్కెట్ పరిధిలోని రేణికుంటకు వెళ్లి విక్రయించుకోవాలని సీసీఐ అధికారులు చెబుతున్నారు. అయితే రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాల రైతులు రేణికుంటకు వెళ్లి విక్రయించాలంటే రవాణా చార్జీలు భరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సీసీఐ అధికారుల నిబంధనలు ఇటు రైతులకు, అటు మిల్లర్లకు శరాఘాతంగా మారాయి. సోమవారం కొనుగోళ్లు నిలిపివేయడంతో రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత మంగళవారం నుంచి కొనుగోళ్లు తిరిగి ప్రారంభిస్తామని, ఎల్-1 నుంచి ఎల్-3 నిబంధనలకు సీసీఐ సడలించిందని, రైతులు తమ పత్తిని ఎక్కడి మిల్లులోనైనా విక్రయించుకునే అవకాశం కల్పించిందని మిల్లర్లు చెబుతున్నారు.
పొద్దంతా పడిగాపులు
సీసీఐ అధికారుల ఆంక్షల నేపథ్యంలో సోమవారం పత్తి మిల్లుల్లో కొనుగోళ్లు నిలిపి వేశారు. మార్కెటింగ్ అధికారులు కూడా సెలవు ప్రకటించారు. ఈ విషయం తెలియని రైతులు పత్తితో మిల్లుల వద్దకు వెళ్లారు. జిల్లాలోని దాదాపు అన్ని మిల్లుల వద్ద రైతులు పత్తి వాహనాలతో వచ్చి గేట్ల వద్దనే పడిగాపులుగాశారు. తిండీ తిప్పలు లేక మిల్లుల వద్దనే గంటల తరబడి నిరీక్షించారు. ఒక పక్క సీసీఐ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని, కొనుగోళ్లు జరుపుతామని మిల్లర్లు రైతులకు చెప్పుకొంటూ వచ్చారు. తెల్లవారు జామున వచ్చిన రైతులు గంటల తరబడి ఉన్నా మిల్లులు తెరుచుకోకపోవడంతో కొందరు నిరాశతో వెనుదిరిగారు. తిరిగి వెళ్లి మళ్లీ వచ్చి విక్రయిస్తే అదనంగా రవాణా చార్జీలు భరించాల్సి వస్తుందని చాలా మంది రైతులు సాయంత్రం వరకు వేచి ఉండి పత్తి విక్రయించుకుని వెళ్లారు. సీసీఐకి మిల్లర్లకు మధ్య సయోధ్య కుదరడంతో మంగళవారం నుంచి యధావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని మార్కెటింగ్ శాఖ ఏడీఎం ప్రకాశ్ తెలిపారు.
సీసీఐ కొన్నది నామ మాత్రమే..
సీసీఐ అధికారులపై ఒత్తిడి తెచ్చి రైతుల నుంచి సక్రమంగా కొనుగోళ్లు జరిపించే బాధ్యత సర్కారుది. కానీ, పర్యవేక్షణ కరువై ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్న చందంగా మారింది. ఈ పరిస్థితుల్లో రైతులు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నది. సీసీఐ నిబంధనల ప్రకారం ఉన్న పత్తిని కూడా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తున్నది. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 7,521 ఉండగా, వ్యాపారులు మాత్రం 6,600 నుంచి 6,800 వరకు చెల్లిస్తున్నారు. నిబంధనల ప్రకారం 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తినే సీసీఐ కొనుగోలు చేస్తుంది. ఇప్పటికీ 30 శాతం తేమ వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో తేమ వస్తే వ్యాపారులు ఎలా కొంటారనేది వాళ్లకే తెలియాలి. కాగా, కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లను పరిశీలిస్తే సీసీఐ కొన్నది నామమాత్రమనే తెలుస్తున్నది. కరీంనగర్ మార్కెట్ పరిధిలో సీసీఐ 667 క్వింటాళ్లు కొంటే వ్యాపారులు 400 క్వింటాళ్లు కొన్నారు. జమ్మికుంటలో 1,247 క్వింటాళ్లు సీసీఐ కొంటే, 24,215 క్వింటాళ్లు ప్రైవేట్ వ్యాపారులు కొన్నారు. చొప్పదండిలో 204 క్వింటాళ్లు సీసీఐ కొంటే, 153 క్వింటాళ్లు ప్రైవేట్ వ్యాపారులు కొన్నారు. ఒక్క గోపాల్రావుపేట మార్కెట్ యార్డు పరిధిలో మాత్రం సీసీఐ మాత్రమే 930 క్వింటాళ్లు కొన్నది. మొత్తంగా చూస్తే సీసీఐ కేంద్రాల్లో కేవలం 3,048 క్వింటాళ్లు కొంటే, 24,768 క్వింటాళ్లు ప్రైవేట్ వ్యాపారులే కొన్నారు. మున్ముందు భారీ కొనుగోళ్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోక తప్పదనేది స్పష్టంగా కనిపిస్తున్నది.
తెల్లారంగ వచ్చినం
ఇయ్యాళ పత్తి కొంటలేరనే సంగతి నాకు తెల్వక తెల్లారంగానే వచ్చిన. కొద్దిగనేకదా జెల్ది అమ్ముకుని ఇంటికి పోదమని నోట్లె మంచి నీళ్లు సుతం పొయ్యకుంట వచ్చిన. మీటింగ్ అయిపోయినంక మూడు గంటలకు గేట్లు తీసిన్రు. సీసీఐ అధికారులు అడ్డగోలు నిబంధనలు పెడితే మేం ఎక్కడికి వెళ్లి అమ్ముకోవాలె. మాది చామన్‌పల్లి మాకు ఎలబోతారం మిల్లు దగ్గరుంటది. రేణికుంటకుపోయి అమ్ముకోవాల్నంటే ఎట్ల పోతం.
– బోడగొండ తిరుపతి, చామన్‌పల్లి (కరీంనగర్)
పత్తి పండిచ్చుడే తప్పయితంది
పత్తి పండిచ్చుడే తప్పయితంది. తేమ ఎక్కువ ఉన్నదని నిన్నామొన్నటిదాకా కొననే లేదు. ఇప్పుడు కొంటమని చెప్పి మళ్లీ ఒక్క మిల్లుకే ఇచ్చిండ్రట. మాది చొప్పదండి మండలం వెదురుగట్ట. మేమెప్పుడు ఎలబోతారంలనే అమ్ముతం. ఇక్కడికి రావాల్నంటే ఆటోకైతే వెయ్యి రూపాయలైతన్నయి. సీసీఐ అధికారులు చెప్పినట్టు రేణికుంటకు పోవల్నంటే మూడు వేలన్న అయితయి. నేను తెచ్చింది నాలుగైదు కింటాళ్లు. దీనికచ్చే పైసల నుంచి మూడు వేలు పోయినంక నాకేం మిగులుతయి. అందుకే ఎక్కడి పత్తి అక్కన్నే అమ్ముకునెతట్టు చెయ్యాలె.
– ఇరుగురాళ్ల మునీందర్, వెదురుగట్ట (చొప్పదండి)
మూడు క్వింటాళ్ల పత్తికి 30 కిలోమీటర్లు పోవాల్నా
మాది చామన్ పల్లి. నేను మూడు క్వింటాళ్ల పత్తిని ఎలబోతారం తెచ్చిన. ఇక్కడైతే దగ్గరుంటది. అమ్ముకొని ఇంటికి పోవచ్చు. కానీ, సీసీఐ అధికారులు చెప్పినట్టు అమ్మాలంటే నేను రేణికుంటకు పోవాల్సి వస్తది. ఈ ముత్తెమంత పత్తి అమ్మతానికి 30 కిలో మీటర్ల దూరం పోవల్నా? ఇసొంటి అధికారులను ఎక్కడ చూడలే. ఎక్కడి రైతులు అక్కడ అమ్ముకుంటే మంచిదా..? ఇక్కడి రైతులు పోయి అక్కడ, అక్కడి రైతులచ్చి ఇక్కడ అమ్మితే మంచిదా.. సీసీఐ కొనది కొనెటోళ్లను కొననియ్యది అన్నట్లయ్యింది. మంచి పత్తి ఉంటె కూడా కొంటలేరు. 8 శాతం తేమ ఉన్న పత్తికి సుతం వంకలు పెడుతున్నరు. రైతులు విసిగి పోతున్నరు. మునుపటి లెక్క పట్టించుకునెటోళ్లు లెకుంటయ్యిండ్రు.
– మెరుగు రమేశ్, చామన్‌పల్లి (కరీంనగర్)