ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)లో అసలు ఘట్టం నేటి నుంచి మొదలు కాబోతున్నది. మూడు రోజులుగా చేస్తున్న హౌస్‌లిస్టింగ్ సర్వే శుక్రవారం రాత్రి వరకు పూర్తవుతుందని యంత్రాంగం భావించినా, పలు జిల్లాలో పూర్తికాలేదు. దీంతో నాలుగోరోజు శనివారం కూడా కొనసాగించాలని నిర్ణయించిన అధికారులు, ఇదే సమయంలో ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రశ్నలకు సంబంధించి ఫార్మాట్ మారడంతో మళ్లీ ఆగమేఘాల మీద ఏ జిల్లాకు ఆ జిల్లా ఫారాల ముద్రణకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇవి శనివారం ఉదయం వరకు కూడా అందరికీ అందేలా లేవని తెలుస్తున్నది. దీంతో హైరానా పడుతున్న అధికారులు.. ఆ మేరకు ఎన్యుమరేటర్లకు ప్రత్యామ్నాయ విధులు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటుండగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పూర్తి స్థాయిలో సర్వే ఆదివారం లేదా సోమవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తున్నది.
కరీంనగర్, నవంబర్ 8 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఈ నెల 6 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ముందుగా చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ రోజు నుంచే ఇంటింటి సర్వే ప్రారంభం కావాలి. కానీ, 2011 తర్వాత జనాభా లెక్కలు, నివాసాల సంఖ్య కచ్చితంగా లేకపోవడం వంటి కారణాల నేపథ్యంలో ముందుగా నివాసాలు లెక్కింపు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు 6, 7, 8 తేదీల్లో హౌస్‌లిస్టింగ్ చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా గుర్తించిన నివాసాలు, ఆనాటి బ్లాక్‌లను పరిగణలోకి తీసుకొని, ముందుగా ఎన్యుమరేటర్లను నియమించిన అధికారులు.. పాత బ్లాక్ పరిధిలో 2011 నుంచి 2024 మధ్య కొత్తగా నిర్మించిన నివాసాలను లెక్కిస్తున్నారు. ఒక ఇల్లు కూడా మిస్ కాకుండా ఉండేందుకు గుర్తించిన ప్రతి ఇంటికీ స్టిక్కర్ అంటిస్తున్నారు. దీని వల్ల నివాసాల లెక్క పక్కాగా జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గృహాల సంఖ్య భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తున్నది. నిజానికి ఈ నివాసాల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం రాత్రి వరకు పూర్తి కావాలి. కానీ, ఒక్క సిరిసిల్ల మినహా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సంపూర్ణంగా పూర్తి కాలేదని అధికావర్గాల ద్వారా తెలుస్తున్నది. అందుకు కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తున్నది. కాగా, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. 2011తో పోలిస్తే ఒక్కో జిల్లాలో 5 నంచి 7వేలకుపైగా కొత్తగా నివాసాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో లెక్క పూర్తిగా తేలితే తప్ప పూర్తిస్థాయిలో ఎన్యుమరేటర్లను వేయడం సాధ్యం కాదు. ప్రతి ఎన్యుమరేటర్‌కు 150 ఇండ్ల చొప్పున 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పుడు నియమించారు. ఈ లెక్కన కొత్తగా గుర్తించే ఇండ్లకు కూడా ఎన్యుమరేటర్లను నియమిస్తే.. ఏక కాలంలో సర్వే పూర్తి చేసేందుకు ఆస్కారమున్నది.
గతంలో సర్వే కోసం ముద్రించిన ఫారంలో 56ప్రశ్నలతో కూడిన 75 అంశాలు ఉండేవి. కోర్టు ఆదేశాలు, ఇతర వర్గాల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వం సర్వే ఫార్మాట్‌ను మార్చింది. ప్రస్తుతం 55 ప్రశ్నలతో 75 అంశాలను పొందు పరిచింది. అంటే ఒక్కో ఇంటి యజమాని నిర్ధారిత 75 అంశాలకు సంబంధించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మొదటికి ఇప్పటికి ఫార్మాట్ మారడం, సదరు ఫారాలను పీడీఎఫ్ రూపంలో ప్రభుత్వం గురువారం సాయంత్రం జిల్లాలకు పంపడంతో అదనపు కలెక్టర్లు ఆగమేఘాల మీద ఫారాల ముద్రణకు చర్యలు తీసుకున్నారు.
ఒకే ప్రింటర్ ద్వారా అయితే ఆలస్యమవుతుందని భావించి, నలుగైదుగురు ప్రింటర్లను పిలిచి ఈ బాధ్యతలు అప్పగించారు. అయినా 8 పేజీలతో ఫారం ఉండడం ఒక ఎత్తు అయితే.. వచ్చిన ఫారాలను ప్యాకింగ్ చేసి మండలాల వారీగా పంపడం, అక్కడి నుంచి బ్లాక్‌ల వారీగా వెళ్లడం, తిరిగి వాటిని ఎన్యుమరేటర్లకు అప్పగించడం వంటి ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకొని చూస్తే.. సర్వేఫారాలు శనివారం ఉదయం కల్లా మెజార్టీ ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లకు చేరవన్నది స్పష్టమవుతున్నది. దీంతో సదరు ఎన్యుమరేటర్లను శనివారం కూడా హౌస్‌లిస్టింగ్ సర్వేకు వాడుకోవాలని అధికారులు భావిన్నారు.
ప్రభుత్వం ముందుగా తయారు చేసిన ప్రశ్నల్లో మెజార్టీ శాతం అలాగే ఉంచి, కొన్ని చోట్ల మార్పులు చేసింది. కొన్ని మార్పులు చేర్పులు చేసినా.. ఎనిమిది పేజీలకే ఫారాన్ని పరిమితం చేసింది. ప్రస్తుతం ఒక ప్రశ్న తగ్గినా అంశాల సంఖ్య అలాగే ఉంచింది. మారిన ప్రశ్నలు- అంశాలను చూస్తే ఈ విధంగా ఉన్నాయి. పేజీనంబర్ 5లో ధరణి పాస్‌బుక్ కలిగి ఉంటే నంబర్ రాయండి అనే ప్రశ్నకు అనుసంధానంగా ధరణి పాస్‌బుక్ లేనట్లయితే కారణం తెలిపేందుకు కొత్తగా కాలం యాడ్ చేశారు. అలాగే పేజీ నంబర్ 6లో గతంలో 45వ కాలంలో మీరు డీనోటిఫై చేయబడిన/ సంచార/ పాక్షిక సంచార తెగకు చెందినవారా..? అనే ప్రశ్నను కొత్త ఫారంలో పూర్తిగా తొలగించారు.
పేజీ నంబర్ 7లో ముందుగా విడుదల చేసిన ఫారం ప్రకారం గతంలో ఉన్న కాలం 46(సీ) 46 (డీ) కాలం ఎత్తివేశారు. పేజీ నంబర్ 8లో ఏ అవసర నిమిత్తం రుణం తీసుకున్నారు? ఎక్కడి నుంచి రుణం తీసుకున్నారు? అనే ప్రశ్నలు ఉండగా.. ఇప్పుడు 48(డీ) కాలం పేరిట ఇంకా చెల్లించాల్సిన రుణం ఎంత మొత్తం ఉందనే ప్రశ్నను కొత్తగా యాడ్ చేశారు. ఇదే పేజీలో నివాస గృహం ఏరకం అనే ప్రశ్నకు అనుసంధానంగా మీ ఇండి గోడలు ప్రధానంగా దేనితో నిర్మించారు అనే కొత్త ప్రశ్నను యాడ్ చేశారు. వీటితోపాటు ఇదే పేజీలో కొత్తగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నారా..? ప్రశ్నను జోడించారు.