రాజన్న ఆలయంలో తలనీలాల కాంట్రాక్టర్ నగదు చెల్లింపులో మొండికేస్తున్నాడు. ఏకంగా తొమ్మిది నెలలుగా చెల్లించకపోవడంతో 7.12 కోట్ల బకాయి పడ్డాడు. దీంతో ఆలయ అధికారులు న్యాయపరంగా రాబట్టేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. కాంట్రాక్టర్కు తలనీలాలు నిలిపివేయడంతోపాటు న్యాయస్థానంలో కేసులు వేశారు. అలాగే 2025-27 ఆర్థిక సంవత్సరాలకుగాను తలనీలాల సేకరణ కోసం ఈ నెల 18న టెండర్లు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
వేములవాడ, జనవరి 5: వేములవాడ రాజన్న ఆలయంలో తలనీలాల సేకరణకుగాను 2023-25 రెండు ఆర్థిక సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురానికి చెందిన ‘సుమిత్ ఎంటర్ర్పైజెస్’ 19కోట్ల 8వేలకు టెండర్ దక్కించుకున్నది. సదరు కాంట్రాక్టర్ నాగరాజు మొదట 50 లక్షలు డిపాజిట్ చేసి, ప్రతినెలా 79,17,000 చెల్లించేందుకు 24 చెకులను ఆలయానికి అందజేశాడు. గతేడాది ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి నాటికి 8కోట్ల 92లక్షల 4500 చెకుల ద్వారా చెల్లించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత చేతులెత్తేశాడు. నూతన ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ నుంచి చెల్లించకపోవడంతో ప్రతి నెలా చెకు బౌన్స్ అవుతూ వస్తున్నది. గతేడాది డిసెంబర్ వరకు అంటే తొమ్మిది నెలలకుగాను 7కోట్ల 12లక్షల 53వేలు బాకీ పడ్డాడు. అయితే టెండర్లోని నిబంధనల ప్రకారం నగదు చెల్లించాలని కాం ట్రాక్టర్కు ఇప్పటికే నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో ఆలయ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చెక్ బౌన్స్ కావడంతో ఇప్పటివరకు న్యాయస్థానంలో నాలుగు కేసులు నమోదు చేశారు.
ఆధీనంలోనే తలనీలాలు
కాంట్రాక్టర్ నగదు చెల్లించకపోవడంతో ఆల య అధికారులు గత ఏప్రిల్ నుంచి తలనీలాలను నిలిపివేశారు. అప్పటి నుంచి కల్యాణకట్టలో భక్తులు సమర్పించే తలనీలాలను భద్రపరుస్తూ వస్తున్నారు. తొమ్మిది నెలలుగా సమకూరిన తలనీలాలు చెడిపోకుండా ఇప్పటికే రెండుసార్లు ఆరబెట్టారు. వాటిని వేలం వేసేందుకు అనుమతి ఇవ్వాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను కోరినట్టు తెలిసింది.
ఈనెల 18న టెండర్
ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు అంటే మార్చి 31 నాటికి సదరు కాంట్రాక్టర్ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2025-27 రెండేం డ్లకుగాను తలనీలాల సేకరణకుగాను టెండర్, బహిరంగ వేలాన్ని మూడు నెలల ముందే ఈ నెల 18న నిర్వహించేందుకు సిద్ధమవున్నారు.
బకాయిలను రాబడుతాం
తలనీలాలను సేకరించే కాంట్రాక్టర్ తొమ్మిది నెలలుగా నగదు బకాయి పడ్డాడు. ఆ నగదును రాబట్టేందుకు ఇప్పటికే న్యాయపరంగా నోటీసులు జారీ చేశాం. నాలుగు కేసులు కూడా నమోదయ్యాయి. స్వామివారికి రావలసిన ప్రతి రూపాయిని న్యాయపరంగా రాబడుతాం. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల కాలనికి ఈ నెల 18న తలనీలాల టెండర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. – వినోద్ రెడ్డి, ఈవో (రాజన్న ఆలయం)