Metpally | మెట్పల్లి, జూన్ 22 : పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని, మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, చక్కెర ఫ్యాక్టరీ నరుద్ధరణ కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమపై నమోదైన కేసులకు సంబంధించి సోమవారం మెట్పల్లి జూనియర్ సివిల్ కోర్టుకు రైతులు హాజరయ్యారు. అనంతరం కోర్టు వెలుపల విలేకరులతో రైతు ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5 వేల మంది శాంతియుత నిరసనలో పాల్గొంటే కక్షపూరితంగా 36 మంది రైతులపై అక్రమంగా కేసులు పెట్టడంతో కోర్టు చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే రైతులం పశువులు, పంటలను వదిలిపెట్టి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి రైతుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, కొడిపెల్లి గోపాల్ రెడ్డి, మారు మురళీధర్‌రెడ్డి, అల్లూరి మహేంద రెడ్డి, వేముల కరుణాకర్ రెడ్డి, నాగుల వామన్‌రెడ్డి, ఏలేటి మహిపాల్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.