ముకరంపుర, మార్చి 31 : కరీంనగర్‌లోని రేకుర్తి-శాతవాహన యూనివర్సిటీ ప్రధాన రహదారిలో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. అంబేదర్ చౌరస్తా నుంచి శాతవాహన యూనివర్సిటీకి వెళ్లే మార్గంలో కొత్తవాడ వద్ద అదుపు తప్పి మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ వాల్వ్‌ను బలంగా ఢీకొట్టింది. కారు వేగం ధాటికి పైప్‌లైన్ వాల్వ్ విరిగి పడిపోగా.. అధిక ఒత్తిడితో నీరు భారీగా ఎగిసిపడింది. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి అదే వేగంతో పకనే ఉన్న కూరగాయల దుకాణాన్ని ఢీకొట్టడంతో కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దుకాణంలో ఉన్న ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పట్టుకున్నారు. వాల్వ్ లీకేజీతో సమీప ప్రాంతాలు జలమయం కాగా, స్థానికులు ఎలగందులలోని మిషన్ భగీరథ ప్రధాన పంపింగ్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో నీటి సరఫరాను నిలిపివేశారు. కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలతోపాటు చొప్పదండి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సాయంత్రంలోగా మిషన్ భగీరథ సిబ్బంది వాల్వ్‌కు మరమ్మతులు చేశారు.