Arrested | జగిత్యాల కలెక్టరేట్ : ఇంటినే గంజాయితోటగా మార్చిన ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ సంఘటన జగిత్యాల మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మెతుకు రాజు ఇంటి ఆవరణలో గంజాయి పెంచుతున్నారనే సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో జగిత్యాల సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జగిత్యాల రూరల్ ఎస్సై సధాకర్ నర్సింగాపూర్ లోని రాజు ఇంట్లో సోదాలు చేశారు.
ఈ క్రమంలో ఇంటి ఆవరణలో నాలుగు గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తించారు. కాగా ఆ 4 మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ మొక్కలు గ్రా.241ల బరువు ఉందని పోలీసులు తెలిపారు. కాగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని రకాల అక్రమ కార్యకలాపాలపై కఠినంగా చర్యలు తీసుకుంటూ, నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నామని, మత్తుపదార్థాల వ్యసనాన్ని నివారించేందుకు ఇలాంటి దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. గంజాయి సాగు, రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారి సమాచారం అందించాల్సిందిగా ప్రజలను కోరారు.