Sarangapur | సారంగాపూర్, డిసెంబర్ 7: సారంగాపూర్, బీర్ పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై ఆదివారం సారంగాపూర్, బీర్ పూర్ మండల కేంద్రాల్లో ఆధికారులు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల నియమావళి ప్రకారం నిర్దేశించిన నియమాలను పాటిస్తూ సర్పంచ్ అభ్యర్థులు రోజువారీ ఖర్చులను అభ్యర్థులు తప్పనిసరిగా ఆడిట్ అధికారి వద్ద నమోదు చేసుకోవాలని, కేటాయించిన ఖర్చులోపే అభ్యర్థులు ఖర్చు చేయాలని ఎక్కువ మొత్తంలో డబ్బులను ఖర్చు చేసినట్లయితే వారిపై ఎన్నికల నియమావళి కింద కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
గ్రామాల్లో అభ్యర్థులు ఎవరి ప్రచారం వారు నిర్వహించుకోవాలని, ఒకరిపై ఒకరు ద్వేషించుకోకూడదని, ఇంటింటికి తిరుగుతూ తమ ప్రచారాన్ని శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. గ్రామాల్లో వాహనాలు, మైక్సెట్లు వాడే అభ్యర్థులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. అభ్యర్థులు ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల లోపు మాత్రమే గ్రామాల్లో ప్రచారం నిర్వహించుకోవచ్చన్నారు. గ్రామాల్లో గోడ రాతలు, పోస్టర్లు, ప్రభుత్వ కార్యాలయాలపై వేయకూడదని, ప్రైవేట్ భవనాలపై వేసేప్పుడు తప్పనిసరిగా యజమానుల అనుమతి తీసుకొని ప్రచారం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎన్నికల నియమావళిపై వివిధ అంశాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎన్నికల ఆడిటింగ్ అధికారి మనోహర్, ఎంపీడీఓలు సలీం, భీమేష్, తహసీల్దార్లు వహిదొద్దిన్, సుజాత, ఎస్ఐలు గీత, రాజు, ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు, ఆర్ఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.