సిరిసిల్ల ప్రజానీకం ఆది నుంచీ గులాబీ పార్టీకి అండగా నిలుస్తున్నది. నాటి ఉద్యమం నుంచి నేటి బంగారు తెలంగాణ దాకా బీఆర్ఎస్ వెంటే నడుస్తున్నది. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, గడపగడపకూ చేరువైన సంక్షేమాన్ని చూసి గుండెల్లో పెట్టుకుంటున్నది. ఎన్నికలు ఏవైనా కారుకే జై కొడుతూ.. సిరిసిల్ల గడ్డపై ఇతర పార్టీలకు చోటు లేదని స్పష్టమైన తీర్పునిస్తున్నది. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు వరుస విజయాలు అందిస్తూ.. మీ వెంటే మేమున్నామని చెబుతున్నది.
అందులో జిల్లా రూపురేఖలను మార్చి, రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన మంత్రి కేటీఆర్‌కు అయితే గత ఎన్నికల్లో 89 వేల భారీ మెజార్టీనిచ్చి, రికార్డు సృష్టించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రజానీకం సిద్ధమవుతున్నది. అందుకే ఎక్కడికక్కడ గులాబీ అభ్యర్థులకు మద్దతుగా తీర్మానాలు చేస్తూ మద్దతు ప్రకటిస్తున్నది.
– రాజన్న సిరిసిల్ల, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ)
ఆది నుంచీ సిరిసిల్ల జిల్లా ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ రాకముందు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులే ఎమ్మెల్యేలుగా గెలిచేవారు. కానీ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడి ప్రజలు చరిత్రను తిరగరాశారు. పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల నుంచి మొదలు అసెంబ్లీ ఎన్నికల వరకు గులాబీ అభ్యర్థులనే గెలిపిస్తూ.. రికార్డు సృష్టించారు.
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్కు కంచుకోటలా మారింది. ఇక్కడి ప్రజలు ఆది నుంచీ అండగా నిలుస్తున్నారు. ఉద్యమం నుంచి వెంట నడుస్తూ అడుగడుగునా మద్దతునిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రతి ఒక్కరూ గులాబీ జెండా వైపు చూస్తున్నారు. ఎన్నిక ఏదైనా కారుకే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు భారీ మెజార్టీని అందిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ జైకొడుతున్నారు.
గతేడాది జరిగిన సెస్ ఎన్నికల్లోనూ 15 స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. మరోవైపు పార్టీ సభ్యత్వాల నమోదులోనూ జిల్లా ఆదర్శంగా నిలుస్తున్నది. సిరిసిల్ల నియోజకవర్గంలో సుమారు 80వేల వరకు, వేములవాడ నియోజకవర్గంలోనూ 50వేల పైచిలుకు సభ్యత్వాలు ఉన్నాయి. సభ్యత్వాలు తీసుకోవడమే కాదు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో పునాదిగా పనిచేస్తున్నారు. ప్రతి ఎన్నికలోనూ కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో కలిసిమెలసి పని చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు పత్తాలేకుండా పోతున్నాయి. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో దాదాపుగా కనుమరుగయ్యాయి. అందుకు గత ఎన్నికలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
తెలంగాణ వచ్చిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో వేములవాడ నియోజకవర్గం ఏర్పాటైంది. నాలుగుసార్లు జరిగిన అసెబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలకు ఈ ప్రాంత ప్రజలు మెజార్టీని ఇస్తూవచ్చారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థులు రికార్డు సృష్టిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కేటీఆర్, చెన్నమనేని రమేశ్‌బాబు వరుసగా విజయాలు అందుకుంటున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికలు, 2014, 2018 సాధారణ ఎన్నికల్లోనూ గెలిచారు. మంత్రి కేటీఆర్ అయితే, గత ఎన్నికల్లో 89వేల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.
దశాబ్దాలుగా వెనుకబాటులో ఉన్న సిరిసిల్ల స్వరాష్ట్రంలో ప్రగతిలో దూసుకెళ్తున్నది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ అభివృద్ధిలో రాష్ట్రంలోనే అత్యుత్తమమైన నియోజకవర్గంగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని అక్షర సత్యం చేస్తూ అగ్రపథాన నిలిచింది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రిగా కేటీఆర్, పాలనతో తనదైన మార్క్ చూపించారు. యాభై ఏండ్లలో జరుగని అభివృద్ధిని తొమ్మిదిన్నరేండ్లలో కండ్ల ముందుంచారు. వేలాది కోట్ల నిధులతో ‘సిరుల’ఖిల్లాగా ఖ్యాతి గడించేలా ముఖ చిత్రాన్నే పూర్తిగా మార్చివేశారు. వ్యవసాయ, ఇంజినీరింగ్, మెడికల్, పాల్టెక్నిక్ కాలేజీల ఏర్పాటుతో ఎడ్యుకేషన్ హబ్‌లా మార్చారు.
వైద్యం రంగాన్ని కూడా బలోపేతం చేసి, పేదలకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో శ్రీ రాజరాజేశ్వర జలాశయం, అన్నపూర్ణ ప్రాజెక్టు, మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేయించి, మెట్టప్రాంతాన్ని కాళేశ్వర జలాలతో అభిషేకించారు. ఇచ్చిన మాట ప్రకారం ఎగువమానేరును మండుటెండల్లోనూ మత్తడి దూకించారు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాలతో యువతకు ఉపాధి కల్పించారు. వస్త్రపరిశ్రమకు జీవం పోసి, నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగు పరిచారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు, లక్ష రూపాయల రుణమాఫీ, వర్క్ టూ ఓనర్, సబ్సిడీ రుణాలు, నేతననకు చేయూత, నేతన్న బీమా ఇలా ఎన్నో కార్యక్రమాలతో బతుకులకు భరోసా కల్పించారు. అలాగే సిరిసిల్లతోపాటు వేములవాడపైనా ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రగతిని పరుగులు పెట్టించారు.
గడిచిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు అపూర్వ మద్దతు లభించగా, వచ్చే నెల 30న మూడోసారి జరిగే ఎన్నికల్లో మరింత ఆదరణ పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు అనేక కారణాలు దోహదపడుతాయంటున్నారు. ప్రధానంగా 2018 నుంచి 2023 మధ్య ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది. అన్ని రంగాల్లోనూ సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. మరోవైపు గత నెల 15న సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో అద్భుతంగా ఉండడం, 17న సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించడం అందరిలోనూ కొత్త ఉత్సాహం నింపింది. అందుకే ఏ ఊరిలో చూసినా జోరుగా చర్చ సాగుతున్నది. అంతేకాదు, గతంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను తూచ తప్పకుండా అమలు చేస్తున్న బీఆర్ఎస్ ఈసారి చెప్పిన హామీలను కూడా తప్పకుండా అమలుచేసి తీరుతుందన్న నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నది.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వేములవాడతోపాటు ఎల్లారెడ్డిపేట మండలంలో యువ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఉదయం 11గంటలకు వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్టాండ్ సమీపాన ఉన్న ఐబీపీ గోదాం మైదానంలో నిర్వహించే సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి యువకులు పాల్గొననున్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీటీసీ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్ధపు మాధవి, బండ నర్సయ్య, ఏనుగు మనోహర్‌రెడ్డి, రాఘవరెడ్డి, లోక బాపురెడ్డి పాల్గొననున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాయత్రీ డిగ్రీ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2గంటలకు జరిగే యువ ఆత్మీయ సమ్మేళానానికి నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆరు మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఆయాచోట్ల సమ్మేళనాల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
మంత్రి కేటీఆర్ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన టెక్ సెల్‌వింగ్(సోషల్‌మీడియా)ను ప్రారంభించనున్నారు. 10.30గంటలకు వివిధ పార్టీలకు చెందిన ముఖ ్యనాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. అనంతరం 11గంటలకు వేములవాడ, మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఏర్పాట్లను ముఖ్య నేతలు పరిశీలించారు. వేములవాడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు పులం రాజు పరిశీలించారు. సభ విజయవంతం చేసేందుకు గానూ పలు సూచనలు చేశారు.
తమ అభిమాన నాయకుడు, ప్రగతి ప్రదాత అమాత్యుడిపై ప్రజల అభిమానం వెల్లువెత్తుతున్నది. జరుగబోయే ఎన్నికల్లో లక్షకు పైగా మెజార్టీతో కేటీఆర్‌ను గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులతోపాటు ప్రజలంతా పట్టదలతో ఉన్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ రామన్నకు జైకొడుతున్నారు. ఇటు వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కూడా మద్దతు తెలుపుతున్నారు. అభ్యర్థులకు మద్దతుగా రెండు నియోజకవర్గాల్లోనూ తీర్మానాలు చేస్తున్నారు. స్థానిక నాయకులు ఇంటింటికీ వెళ్లి రామన్న, చల్మెడ లక్ష్మీనరసింహారావుకు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు.