వేములవాడటౌన్, ఆగస్టు 8 : అమ్మలోని ప్రేమ, నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్. ప్రతి శ్రావణ పౌర్ణమిన తోడబుట్టినవాళ్లకు రాఖీ కట్టి, తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లంతా కోరుకుంటారు. తమ అన్న, తమ్ముడి నోరు తీపి చేసి వారంతా జీవితాంతం సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తారు.
ఇలా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి రాఖీ పండుగ ఒక వారధిలా నిలుస్తున్న రాఖిట్ల పున్నానికి వేళయింది. శనివారం పండుగ సందర్భంగా శుక్రవారం రాఖీలు, స్వీట్ల కొనుగోళ్లతో మార్కెట్లలో సందడి నెలకొన్నది. ఇటు పుట్టింటికి వచ్చేందుకు తరలివచ్చిన ఆడబిడ్డలతో బస్టాండ్లు కిటకిటలాడగా, రద్దీకి అనుగుణంగా బస్సులు లేక గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. వచ్చిన బస్సులో సీట్లు దొరకకపోవడంతో కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది.