రామగిరి, ఆగస్టు 23: సింగరేణి ఆర్జీ-3 ఏరియా సెంటినరీ కాలనీలోని (Centenary Colony) కోల్ కారిడార్ రోడ్డులో ఇటీవల నిర్మించిన బస్ షెల్టర్ (Bus Shelter) స్థానికులకు ముప్పుగా మారింది. ప్రధాన రహదారికి అతి సమీపంలో షెల్టర్ నిర్మాణం జరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగే అవకాశముంటుందని, చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా ప్రమాదాలు తప్పవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. షెల్టర్ నిర్మాణంలో తగిన ప్రణాళిక లేకుండా పనులు సాగినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది దీనిపై సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టిన ప్రదేశంలో పైన ఎక్స్‌ప్రెస్ లైన్ విద్యుత్ తీగలు ఉన్నాయని, షెల్టర్ ఎదురుగానే ఉన్న రోడ్డును సింగరేణి యాజమాన్యం రూ.48 కోట్లతో విస్తరణ చేపట్టేందుకు టెండర్ కూడా పూర్తిచేసిందని తెలిపారు.
ఈ క్రమంలో రోడ్డు వెడల్పులో షెల్టర్ తొలగించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. సంబధిత అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా ఆదరా బాదరాగా షెల్టర్ నిర్మాణం చేపట్టడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజల భద్రతను పక్కన పెట్టి ఇలా నిర్మాణం జరగడం చాలా విచారకరం. ఈ విధంగా కొనసాగితే ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందని కాలనీ నివాసులు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని షెల్టర్‌ను సురక్షిత ప్రదేశానికి తరలించాలని కోరుతున్నారు.