PEDDAPALLY BUS ACCIDENT | పెద్దపల్లి, ఏప్రిల్ 17( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారిపై వస్తున్న బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దపల్లి మండలం అందుగులపల్లి, అప్పన్నపేట గ్రామాల మధ్య చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రాజీవ్ రహదారిపై పెద్దపల్లి మండలం అందుగులపల్లి, అప్పన్నపేట గ్రామాల మధ్య మరమ్మతుల పనులు జరుగుతుండగా రోడ్డును వన్ వే చేశారు.
దీంతో ఎదురెదురుగా వస్తున్న గోదావరిఖనికి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పెద్దపల్లి వైపుకు వస్తుండగా.. పెద్దపల్లి వైపు నుంచి కరీంనగర్ వైపుకు మట్టి లోడ్ తో తరలి వెళ్తున్న లారీ రెండూ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 50 మందిలో డ్రైవర్‌తోపాటు 25 మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండగా.. మరి కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే లారీ డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలయ్యాయి.
కాగా క్షతగాత్రులను 108 వాహనంతో పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రికి హుటాహుటిన తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.