బోనాలపల్లెకు తూటా గండం పొంచి ఉన్నది. ఎప్పుడు ఎటు నుంచి బుల్లెట్ వచ్చి తాకుతుందోననే భయం వెంటాడుతున్నది. పల్లెకు సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఫైరింగ్ రేంజ్లో కొన్నాళ్లుగా పోలీసులకు ఫైరింగ్ శిక్షణ ఇస్తుండగా, ఇటీవల తూటాలు గ్రామంలోకి దూసుకొస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. గతంలో గోడలను, రేకులను తాకిన ఘటనలు ఉన్నా.. మూడు రోజుల క్రితం ఓ వృద్ధురాలి తొడకు తాకడం కలకలం రేపింది. అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తున్నదనే భయాందోళన గ్రామస్తుల్లో కనిపిస్తున్నది. పల్లెకు, ఫైరింగ్ రేంజ్‌కు మధ్యన ఉన్న ఎత్తయిన గుట్ట నుంచి గ్రానైట్ తవ్వకాలు చేపట్టడంతో ఎత్తు తగ్గి బుల్లెట్లు గ్రామంలోకి వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
..పైఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బోనాల పద్మ. రెండు నెలల క్రితం బోనాలపల్లెకు సమీపంలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ జరుగుతుండగా, ముందున్న గుట్టపై భాగం నుంచి ఓ బుల్లెట్ వీరి ఇంటి సమీపంలోకి వేగంగా దూసుకొచ్చింది. కిటికి భాగంలోని గోడను తాకి ఇంటి ముందున్న సంపు దగ్గర పడింది. పెద్ద శబ్దం రావడంతో మాతోపాటు చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవారంతా ఉలిక్కి పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. ఫైరింగ్ పూర్తయ్యేదాకా ఇండ్లలోనే భయం భయంగా గడిపామంటూ ఆవేదన చెందుతున్నారు.
ముకరంపుర, సెప్టెంబర్ 22 : కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామానికి అనుబంధంగా ఉన్న బోనాలపల్లెకు సుమారు అర కిలోమీటర్ దూరంలో ఫైరింగ్ రేంజ్ ఉన్నది. ఈ పల్లెకు, ఫైరింగ్ రేంజ్‌కు మధ్య ఎత్తయిన గుట్ట ప్రాంతం ఉన్నది. కొన్నేళ్లుగా పోలీసులకు ఇదే ప్రాంతంలో ఫైరింగ్‌పై శిక్షణ కొనసాగతున్నది. కానీ, ఇటీవలి కాలంలో ఫైరింగ్ జరుగుతున్న సమయంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇవీ సమీపంలో ఉన్న బోనాలపల్లె వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఎటు నుంచి బుల్లెట్ వచ్చి తాకుతుందోనని గ్రామస్తులు వణికిపోతున్నారు.
చుట్టూ చేన్లు, పొలాలు, సమీపంలోనే పురాతన ఆలయాలు ఉండగా, క్షణ క్షణం ఆందోళన చెందుతున్నారు. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎవరి ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. కానీ, ఇటీవల తూటా తగిలి గాయాలపాలైన సంఘటన పల్లెవాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. పల్లెకు, ఫైరింగ్ రేంజ్‌కు మధ్యన ఉన్న ఎత్తయిన గుట్ట నుంచి గ్రానైట్ తవ్వకాలు చేపట్టడంతో గుట్ట ఎత్తు తగ్గి బుల్లెట్లు గ్రామంలోకి వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
శనివారం ఫైరింగ్ రేంజ్లో ఉదయం నుంచి పోలీసులకు ఫైరింగ్ శిక్షణ జరుగుతున్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకున్నది. ఫైరింగ్ రేంజ్ నుంచి ఓ బుల్లెట్ గాల్లో దూసుకుపోయింది. తన ఇంటి ముందు అరుగుపై కూర్చున్న బోనాల అమృతమ్మ (85) వృద్ధురాలి కుడి తొడ భాగంలో బలంగా తాకడంతో గాయమైంది. రెండు నెలల క్రితం అమృతమ్మ ఇంటికి సమీపంలో ఉన్న బోనాల పద్మ ఇంటిని సైతం బుల్లెట్ తాకింది.
అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంటి ముందు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ఆపద రాలేదు. ఇలా వరుస ఘటనలతో ఫైరింగ్ జరుగుతున్న సమయంలో తమకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని బోనాల పల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఒకటి రెండు ఇలాంటి సంఘటనలు జరిగినా బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
తాజాగా జరిగిన అమృతమ్మ ఘటనలోనూ బాధిత కుటుంబ సభ్యులు 100కు ఫోన్ చేయడం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం, స్థానికంగా బుల్లెట్ లభ్యం కావడం, పోలీసు అధికారులు విచారణ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే వరుస ఘటనలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సిన దుస్థితి నెలకొన్నదనే ఆందోళన గ్రామస్తుల్లో వ్యక్తమవుతున్నది.
భయం భయంతోటి ఉంటున్నం
ఫైరింగ్ అంటేనే భయం భయంతోటి ఉంటున్నం. మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద మనిషి అమృతమ్మకు తుపాకీ తూటా తాకి గాయమైందంటే అందరికీ భయమైతుంది. ఫైరింగ్ రేంజ్తోటి మాకు ఎటువంటి ఇబ్బంది రావద్దు. ఇప్పటికే చాలా బుల్లెట్లు పడ్డయి. పొలాలు చేన్లు అన్నీ ఫైరింగ్ రేంజ్ చుట్టే ఉన్నయి. ఇక ముందు ఎవ్వళ్లకు ప్రమాదం జరగకుండా పోలీసులు చూడాలే.
– బోనాల అంజమ్మ
తుపాకీ తూటా తాకి తొడ భాగంలో అయిన గాయాన్ని చూపుతున్న ఈ వృద్ధురాలి పేరు బోనాల అమృతమ్మ. ఎనభై ఐదేళ్ల వయసున్న ఆమె, శనివారం ఉదయం 11గంటల సమయంలో తన ఇంటి ముందున్న అరుగుపై కూర్చొని సీతాఫలం తింటున్నది. ఒక్కసారిగా తుంటి, నడుము భాగంలో పెద్ద బండరాయితో కొట్టినట్టు కావడంతో ఉలిక్కి పడింది. అత్యంత వేగంతో బలంగా తాకిన దెబ్బను భరించలేక బోరుమన్నది.
దీంతో చుట్టుపక్కల ఉన్న వారంతా పరుగునా ఆమె వద్దకు చేరుకున్నారు. కుడి తొడభాగం నుంచి రక్తం కారడంతో ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. పక్కనే తుపాకీ గుండు పడి ఉండడాన్ని చూసి ఆందోళన చెందారు. విషయాన్ని పొలంలో ఉన్న అమృతమ్మ కొడుకు మల్లేశంకు తెలిపారు. హుటాహుటిన తల్లి వద్దకు వచ్చి చూశాడు. పక్కనే తుపాకీ తూటా కనిపించడంతో బుల్లెట్ గాయంగా నిర్ధారించుకున్నాడు. వెంటనే 100కు సమాచారమిచ్చి చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించాడు.
బుల్లెట్ దిగి చిల్లు పడిన వంట గదిలోని రేకును చూపిస్తున్న మహిళ పేరు సత్తు లత. కొద్ది నెలల క్రితం ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ జరుగుతున్న సమయంలో ఇంటిపైకి బుల్లెట్ దూసుకొచ్చింది. పై కప్పుగా ఉన్న రేకును చీల్చుకుని వంట గదిలో ఉన్న బియ్యం బస్తాల్లోకి దిగింది. అప్పుడు వచ్చిన చప్పుడుకు వంట చేస్తున్న లత భయపడి ఒక్కసారిగా బయటకు పరుగెత్తింది. బుల్లెట్ బియ్యం బస్తాల్లోకి దిగడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
బయట ఉంటే ప్రాణాలు పోతుండే
రెండు నెలల కిందట బోనాల పద్మ ఇంటి ముందట పెద్ద చప్పుడు అయింది. ఏమైందని అందరం బయటకు వచ్చి చూసినం. ఎక్కడా ఏం లేదు. అటీటు చూస్తే నీళ్ల సంపు దగ్గర తుపాకీ తూటా కనిపించింది. అప్పుడే ఫైరింగ్ రేంజ్‌ల ఫైరింగ్ జరుగుతున్నది. తూటా ఇంటి ముందు పడ్డ టైంల బయట పిల్లలు, మేము ఎవ్వళ్లం లేము. ఉంటే ప్రాణాలు పోతుండే. ఇక ముందట ఇట్ల జరగకుండా ఉండాలే. మాకు ఎలాంటి హాని జరగకుండా చూడాలే.
-బోనాల లలిత