Prajavaani | జగిత్యాల, ఆగస్టు 11: చట్టాలను ఉల్లంఘిస్తూ, లోకాయుక్త న్యాయస్థానం తీర్పును, కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ల ఆదేశాల ఉత్తర్వులను కూడా భే ఖాతర్ చేస్తూ విధులను, బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుగ్గారం వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమారం ప్రజావాణిలో కలెక్టర్కు ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గత ఎనిమిది నెలల నుండి బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు, వీడీసీ వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, వీడీసీ కోర్ కమిటి వైస్ చైర్మన్ పెద్దనవేని రాగన్న ఆరోపించారు.
లోకాయుక్తతో పాటు కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ల ఆదేశాలు, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఆర్డర్లను కూడా తుంగలో తొక్కారని వారు కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుండి జారీ చేసిన అనేక ఉత్తర్వులు, సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, అప్పీల్లను ఇతర ఫిర్యాదులను సైతం బుట్ట దాఖలు చేసి పట్టించుకోవడం లేదన్నారు. బుగ్గారం జీపీలో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ దోషులతో కుమ్మక్కై వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ దోషుల ద్వారా అవినీతికి పాల్పడి తన విధులను, అత్యంత విలువైన బాధ్యతలను విస్మరిస్తున్నారని పలు అనుమానాలను వ్యక్తం చేశారు. అవినీతి- అక్రమాలతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీపీవోపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వారు కలెక్టర్ ను కోరారు.