కరీంనగర్ కార్పొరేషన్, మే 4 : బీఆర్ఎస్ నాయకులను వెంటపడి వేధించడం కాదని, చేతనైతే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని, దోపిడీ దొంగలను పట్టుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల్లో కూడా మంచి వారు ఉన్నారని, వారితో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కానీ, కొంత మంది పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించకుండా అత్యుత్సాహం చూపుతున్నారని, కాంగ్రెస్ ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్నారని, తమ నాయకులను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రెండేళ్ల అనంతరం కేసీఆర్ సీఎం కావడం ఖాయమని, అప్పుడు ఈ పోలీసులు ఎక్కడున్నా.. రిటైర్డ్ అయినా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పీఎంజే జ్యువెల్లరీలో దోపిడీ దొంగల దాడిలో గాయపడి పలు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న బాధితులను కేటీఆర్ సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం పీఎంజే నగల షాపును కూడా పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కరీంనగర్ పోలీసులు తమ నాయకులను వేధించడం, తమ కార్పొరేటర్లపై కేసులు పెట్టి జైలులో వేయడం తప్ప మరో పనిచేయడం లేదని విమర్శించారు. ఎప్పుడో ఇరువై ఏళ్ల క్రితం కేసులను ముందుకు తెచ్చి జైలుకు పంపించడం, యువత సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఫోన్లు చేసి బెదిరించడం, ఒక ట్వీట్ చేస్తే 20 రోజులు జైలులో పెట్టడం.. ఇదేనా పోలీస్ వ్యవస్థ? అని ప్రశ్నించారు.

పోలీసులంటే రాజకీయ కక్ష సాధింపులకు, కొనుగోలు కేంద్రాల వద్ద విపక్షాలు ఆందోళనలు చేస్తే అరెస్టులు చేయడానికే పనిచేస్తారా..? అని, ప్రజలకు భద్రత కల్పించే విషయంలో పని చేయరా..? అని నిలదీశారు. శాంతిభద్రతలు నిర్వహించడం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజల్లో మనోధైర్యం నింపడానికి ఏం కార్యక్రమాలు చేయరా..? అని ప్రశ్నించారు. ధర్మపురికి చెందిన ప్రశాంత్‌పై కూడా కేసులు పెట్టారని తెలిపారు. వీటన్నింటినీ తాము గుర్తు పెట్టుకుంటామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం పోలీసులను తమ పని తాము చేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు. కమలాకర్ ఏం చేస్తున్నాడు? కౌశిక్‌రెడ్డి ఏం చేస్తున్నాడు? జీవన్‌రెడ్డి ఎక్కడ ధర్నా చేస్తున్నాడు? సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడుతున్నారు? ఇదే పనా పోలీసులకు అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎవరి పనులు వారు చేస్తే అన్ని బాగుంటాయని సూచించారు. దోపిడీ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేవరకు పత్రికలు న్యూస్ హైలెట్ చేయాలని కేటీఆర్ సూచించారు.
లేకుంటే పోలీసులు మొద్దు నిద్ర వీడే పరిస్థితి లేదన్నారు. ఈ విషయంలో కరీంనగర్ ప్రజలకు భరోసా కల్పించేలా ప్రభుత్వం, పోలీసులు పని చేయాలని సూచించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసినప్పుడు ఈ రోజు తమకు జరిగిందని, రేపు ఇతరులకు జరగదన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పాలన ఇలాగే ఉంటుందా? అని అడుగుతున్నారన్నారు. తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పామని, బాధితులకు తామ పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకెరవిశంకర్, కోరుకంటి చందర్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనరసింహరావు ,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తుల ఉమ, జిల్లా అధ్యక్షుడు జీ రామకృష్ణరావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, రాష్ట్ర నాయకుడు రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్‌ను సేఫ్ సిటీగా మార్చాలని ప్రత్యేక చొరవ తీసుకున్నం. 769 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినం. కానీ, రేవంత్‌రెడ్డి పాలనలో పట్టపగలే దుండుగులు తుపాకులతో వచ్చి దోచుకొని పోయే దుస్థితి వచ్చింది. ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నరు? సేఫ్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతున్నయి. సంఘటన జరిగిన వెంటనే అన్ని వైపులా నాకాబందీ చేసి తక్షణ చర్యలు చేపట్టి ఉంటే దుండగులను పట్టుకునే అవకాశం ఉండేది. కానీ, 32గంటలు దాటినా వారిని పట్టుకోలేదు. ఎంత చేతగాని ప్రభుత్వం ఉందో అర్థం అవుతున్నది. ప్రభుత్వానికి శాంతిభద్రతలు కాపాడే శక్తి ఉన్నదా.. లేదా..?
– కేటీఆర్
బండి సంజయ్‌కు శవాలు, శివాలు తప్ప ఏం తెలుసు? ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోం శాఖను, పోలీసులను తప్ప బీఆర్ఎస్ను విమర్శిస్తున్నడు? హోం శాఖ సహాయ మంత్రిగా ఆయన ఈ ఘటన గురించి మాట్లాడితే.. ఇది పరిపాలన వైఫల్యమని రాష్ట్ర హోం శాఖను విమర్శించాలి. ఆ శాఖ మంత్రిని ప్రశ్నించాలి. కానీ, పొరపాటున ఒక్క మాట కూడా రేవంత్‌రెడ్డిని అనడు. రేవంత్‌రెడ్డిని అనాలంటే ఎందుకంత భయపడుతున్నడు. కాందీశీకుల భూముల్లో కలిసి పని చేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఆయన ఎవరికి సహాయం చేస్తున్నడో తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తయి. సంజయ్ అప్పుడప్పుడన్న రేవంత్‌రెడ్డిని అనేందుకన్న ధైర్యం తెచ్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా మాట్లాడాలి. కానీ, ఎంతసేపూ మాపై ఏడవడం ఎందుకు?
– కేటీఆర్