హుజూరాబాద్/ హుజూరాబాద్ టౌన్, మే11: పదేండ్ల బీజేపీ పాలన విషంతో సమానమని, 150 రోజుల కాంగ్రెస్ పాలన అబద్ధాలమయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేండ్ల కేసీఆర్ పాలన నిజమని స్పష్టం చేశారు. ఎవరు కావాలో ప్రజలు తేల్చుకోవాలని, తమకు అండగా నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే వాళ్లంతా 10 నుంచి 12 ఎంపీ సీట్లు ఇస్తే ఆరు నెలల్లో మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాడని జోస్యం చెప్పారు.
బీజేపీ పాలనలో ఏ ఒక్క మంచి పనీ జరగలేదని, ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు అన్నీ ఝూటా మాటలు మాట్లాడుతున్నదని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను యూటీ చేసే కుట్ర కూడా చేస్తున్నారని, అందుకే పార్లమెంట్లో గల్లా పట్టి అడిగే ఎంపీలు ఉండాలని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హుజూరాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి బీ వినోద్‌కుమార్‌తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశేషంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
కేసీఆర్ పాలనలో సబ్బండవర్గాలకు మేలు జరిగిందని, అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. బీజేపీ పాలనలో ఏ వర్గానికి మేలు జరగలేదని, దేశంలోనే చేనేతపై జీఎస్టీ వేసిన మొదటి ప్రధాని మోడీనేనని మండిపడ్డారు. అలాగే నిత్యవసరాల ధరలు పెంచి, సామాన్యులపై భారం మోపుతున్నాడని ఆగ్రహించారు. పదేళ్లు ఏం చేసినవయ్యా అంటే చెప్పడానికి వాళ్లకు ఏమీ లేదని, అందుకే గుడికట్టినం అని చెప్పుకుంటున్నారన్నారు.

మనం కూడా గుడి కట్టినమని, కేసీఆర్ యాదాద్రిని కట్టలేదా? గుడి మాత్రమే కాదు, ఆధునిక దేవాలయాలైన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కట్టిండని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి వచ్చి మస్తు ఉత్తముచ్చట్లు నరికిండని విమర్శించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, 500 బోనస్, 2 లక్షల ఉద్యోగాలు, తులం బంగారం, సూటీలు, మహిళలకు 2500, పెద్ద మనుషులకు 4 వేలు అని చెప్పి ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు.
ఎంపీ అంటే రాష్ట్రానికి పైసలు తేవాలె. అభివృద్ధి చేయాలె. కానీ, బండి సంజయ్ ఐదేళ్లలో ఏం చేసిండు? హిందూ ముస్లిం మధ్య పంచాయితీ పెట్టుడు, అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప ఏమీ లేదు. ఎకడైనా ఆయన చేసిన అభివృద్ధి కనిపించిందా? ఏమన్నా అంటే ఆయన రాముడు గురించి మాట్లాడుతడు. రాముడంటే మాకు కూడా భక్తి ఉన్నది. అసలు బీజేపోళ్లే మనకు కట్టు, బొట్టు, పండుగలు నేర్పించినట్టు బిల్డప్‌లు ఇస్తున్నరు. ఆ పార్టీ లేకుంటే దేవుడే లేనట్టు ప్రజలను మభ్యపెడుతున్నరు. గాలి తిరుగుడు తిరుగుతూ, పిచ్చి మాటలు మాట్లాడే బండి సంజయ్ మనకెందుకు? చదువుకున్న వ్యక్తి, ఈ ప్రాంతం కోసం కొట్లాడే వినోదన్ననే గెలిపించాలి.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ మోసం చేసి గెలిచింది. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను నిండా ముంచింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి చేసిందేమీ లేదు. కాశీ ఎంపీగా ఉన్న మోడీ దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన వేములవాడకు ఎందుకు నిధులు కేటాయించలేదు. ఇక బండి సంజయ్ ఈ ప్రాంతానికి నిధులు కేటాయించాలని మోడీని ఒక్కనాడు అడిగిన పాపాన పోలేదు. ఆయన కరీంనగర్‌కు చేసిందేంటి? ఇప్పడు బీజేపీ హైదరాబాద్‌ను యూటీగా మార్చే కుట్రలు చేస్తున్నది. దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వత్తాసు పలుకుతున్నడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్లో కొట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి. ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి నన్ను ఎంపీగా గెలిపించాలి.
– బీ వినోద్‌కుమార్, కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి