వేములవాడ, నవంబర్ 21 : పూర్తయిన ప్రాజెక్టులు కండ్ల ముందు కనిపిస్తున్నా పదేళ్ల పాలనలో ఒక ప్రాజెక్టు అయిన పూర్తి చేశారా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించడం ఆయన అవివేక దృష్టికి నిదర్శనమని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు విమర్శించారు. నాటి కాంగ్రెస్ పాలనలో వదిలేసిన పనులన్నింటినీ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేశారని, మెట్ట ప్రాంతంలో ప్రతి ఎకరాకూ సాగునీరిచ్చి పచ్చగా మార్చారని కొనియాడారు. కానీ, రేవంత్ రెడ్డి అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పకుండా రాజన్న సన్నిధిలో ఎంతసేపూ కొడంగల్ జపం చేసి రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని, ఇదే మీ అసమర్థ పరిపాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఆయన కొడంగల్‌కు మాత్రమే ముఖ్యమంత్రి కాదని, ఈ రాష్ట్రానికి సీఎం అన్న విషయాన్ని మరిచిపోయారని ఎద్దేవా చేశారు. వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములవాడ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
మధ్యమానేరు ప్రాజెక్టు పనులను 2005లో ప్రారంభించి, 2009లో పూర్తి చేస్తామని అప్పటి సీఎం వైఎస్సార్ చెప్పారని గుర్తు చేశారు. అందులో కాంట్రాక్టర్‌గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మధ్యలోనే వదిలేసి పారిపోయాడని ఎద్దేవా చేశారు. కానీ, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మధ్యమానేరు జలాశయాన్ని పూర్తి చేసి రాష్ర్టానికే గుండెకాయలా మార్చారని ప్రశంసించారు. కాళేశ్వరం ప్యాకేజీ 9లో భాగంగా మలపేట రిజర్వాయర్‌ను నిర్మించి, ట్రయల్ రన్ చేసి ఒక టీఎంసీ నీటిని కూడా ఎత్తిపోసిన విషయం స్థానిక ఎమ్మెల్యేకు కూడా తెలువకపోవడం విడ్డూరమన్నారు. ఇంకా రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశమున్నా ఎందుకు నింపడం లేదని ప్రశ్నించారు. కుడి, ఎడమ కాలువలు కూడా దాదాపు పూర్తయ్యాయని, కొంత అకడకడ భూమి సేకరించాల్సి ఉందన్నారు. రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపితే సిరిసిల్లలో 42,300, వేములవాడలో 27,700 ఎకరాలకు, అలాగే రెండు నియోజకవర్గాల్లో చెరువులు, కుంటలు నింపితే 90వేల ఎకరాలకు నీరందుతుందని చెప్పారు. సింగసముద్రం పనులు అరకొరగా మిగిలి ఉన్నాయని చెప్పారు. అయినా కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. ఆలయాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని మాట్లాడిన రేవంత్ రెడ్డి, తాను దిగిన హెలీక్యాప్టర్ బండ్, నిర్వహించిన సభా స్థలం గత ప్రభుత్వం సేకరించిదనే విషయం ఆయనకు తెలువకపోవడం విడ్డూరమన్నారు. ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా 30 కోట్లతో 32 ఎకరాలను సేకరించిందని, 70 కోట్లతో బండ్ నిర్మాణం చేపట్టిందని తెలిపారు. మరో 12 కోట్లతో సుందరీకరణ పనులు చేసిందని, నిత్యం రాజన్న ధర్మగుండం గోదావరి జలాలతో నిండుకుండలా ఉండేందుకు 17కోట్లతో మధ్యమానేరు నుంచి గుడి చెరువుకు లిఫ్ట్ కూడా వేసిందని గుర్తు చేశారు. నిత్యం రాజన్న భక్తులకు, స్వామివారి అభిషేకానికి కూడా ఇబ్బంది లేకుండా 5 కోట్లతో మిషన్ భగీరథ నీటిని అందించిందన్నారు. 17.50 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ కోసం స్థలం సేకరించిందన్నారు. ఇవన్నీ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగం కాదా? అని ప్రశ్నించారు. ఆలయానికి 76 కోట్లతో శిలాఫలకం వేసిన రేవంత్ రెడ్డి, మాస్టర్‌ప్లాన్‌కు కావాల్సిన నిధులెన్ని?
ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఎన్ని విడుతల్లో నిధులు ఇస్తారనే స్పష్టత ఇవ్వకపోవడం ఆయన చిత్తశుద్ధిని బయట పెడుతున్నదని విమర్శించారు. 16 శిలాఫలకాలను ఆవిషరిస్తే, అందులో 12 గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకే వేశారన్నారు. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులని అబద్ధాలతో ప్రజలను నమ్మించలేరని వ్యాఖ్యానించారు. మంత్రులు మాట్లాడిన దానికి సీఎం మాట్లాడిన దానికి పొంతనే లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి , జడ్పీ మాజీ చైర్పర్సన్ అరుణ, ఈగల రవీందర్ గౌడ్, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు నర్సయ్య యాదవ్, రామ్మోహన్ రావు, పార్టీ అధ్యక్షులు గోసుల రవి, మ్యాకల ఎల్లయ్య, మల్యాల దేవయ్య, ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, కౌన్సిలర్లు మారం కుమార్, నిమ్మశెట్టి విజయ్, నరాల శేఖర్, మాజీ ఎంపీపీ స్వరూపారాణి, నాయకులు రాఘవరెడ్డి, పొలాస నరేందర్, రామతీర్థపు రాజు, మాడిశెట్టి ఆనందం, వెంగళ శ్రీకాంత్ గౌడ్, ఈర్లపల్లి రాజు, నరాల దేవేందర్, అంజద్ పాషా, వాసాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎన్నికల ముందు మధ్యమానేరు నిర్వాసితులందరికీ 5లక్షల 4వేలు ఇస్తామని రెచ్చగొట్టారు. ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నారు. 10,600 మంది నిర్వాసితులుంటే అందులో 4,600 మందికే ఎలా ఇస్తారు? ఇది కూడా ఎగబెట్టే పథకమే. రేవంత్ కొడంగల్‌కు మాత్రమే ముఖ్యమంత్రి కాదు. ఈ రాష్ట్రానికి సీఎం అన్న విషయాన్ని మరిచిపోయారు. ఆయన ఎంతసేపూ అకడి ప్రాంత యువత గురించే మాట్లాడారు. కానీ, ఇక్కడి నిర్వాసిత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయాన్ని మరిచారు. స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. మంత్రులు కూడా ఇక్కడి ప్రజలకు ఎలాంటి వరాలు ఇవ్వలేదు. ఇదే మీ కపట ప్రేమకు నిదర్శనం.