Open discussion | సిరిసిల్ల టౌన్, జూన్ 22: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. ఏఎంసీ చైర్మన్ వెలుముల స్వరూపను అభివృద్ధిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్లలోని కొండా లక్ష్మణ్ బాపూజి విగ్రహం ఏర్పాటులో తాను రూ.70 లక్షలు అవినీతికి పాల్పడినట్లు చేసిన ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలన్నారు. కాంట్రాక్టర్ చేసిన పనులకు తనకు ఏ సంబంధం ఉంటుందన్నారు.
క్రీడా ప్రాంగణాలు పేరిట రూ.30 లక్షలు తీసుకున్నామని చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సదరు ఆరోపణలపై అధికార పార్టీలో ఉన్న మీరు సంబంధిత ఎంబి రికార్డు తీసుకుని వస్తే గాంధీచౌక్ లో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తమ హయాంలో ఏడాదిన్నర కాలంలోనే మున్సిపల్ పరిధిలో దాదాపు రూ.80కోట్ల పమలు చేశామని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ గా తాను ఉన్న సమయంలో ఆరు నెలల వ్యవధిలోనే రూ. 25కోట్ల నిధులతో ఏఎంసి భవనం నిర్మించామన్నారు. వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలతో మీ విజ్ఞత అర్థమవుతుందన్నారు.
రైతు బజార్ సైతం తమ పాలనలోనే నిర్మించామని తెలిపారు. ప్రతీ రోజు రైతు బజార్లో ఏఎంసి చైర్మన్ భర్త దౌర్జన్యం చేస్తున్నాడని ఆరోపించారు. సిరిసిల్ల ప్రజలు మీ దౌర్జన్యాన్ని గమనిస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలకు కేటీఆర్ రూ.270కోట్లు ఇవ్వకుండా పోయారని అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. గతంలో తమ పాలకవర్గం హయాంలో రూ.40కోట్ల పనులకు తాము టెండర్లు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌లో పెట్టిందన్నారు. రూ.3కోట్ల నిధులు లింక్ రోడ్ల కోసం కేటాయించగా ఆ నిధులను సైతం ఆపేశారన్నారు.
అభివృద్ధి చేయాలని అధికారం ఇస్తే అహంకారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తప్ప మరెన్నడూ ప్రజల్లోకి రాని మీరు మాపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. మీరు చేసిన కుట్రలతోనే మా సోదరుడు జైలుకు వెళ్లాడన్న ప్రజలందరికీ తెలుసునన్నారు.రాబోవు రోజుల్లో మీకు అదే పరిస్థితి వస్తుందన్నారు. మున్సిపల్ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారంటూ మీరు చేసిన నిరాధారమైన ఆరోపణలను ఎవరూ నమ్మబోరని గుర్తుంచుకోవాలన్నారు. ఐదేండ్ల పాలనలో ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదన్నారు.
ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో రూ. కోటిన్నర నామినేటెడ్ పనులు వచ్చనిప్పటికీ ఏ ఒక్క పని ప్రారంభించలేదన్నారు. బిల్లులు వస్తాయో రావోనని సందేహంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గాజుల బాలయ్య, పోచవేని ఎల్లయ్య, లింగంపల్లి సత్యనారాయణ, దార్ల సందీప్, అన్నారం శ్రీనివాస్, మ్యాన రవి, సత్తార్, మామిడాల కృష్ణ, దూస రాజేశం, బుర్ర మల్లిఖార్జున్, సుంకపాక మనోజ్‌కుమార్, జిందం దేవదాస్, వెంగళ శ్రీనివాస్, పోరండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.