రాయికల్, జూలై 29 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతులపై దయలేదని, కానీ దేవుడు దయతలిచి వర్షాలతో కొద్దిగా ఊరట కలిగించాడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షాలతో రైతులకు మళ్లీ ఆశలు కలిగాయని, ఈ సమయంలో విద్యుత్, ఎరువులు, యూరియా సమస్య లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతలతో కలిసి జీవన్‌రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేరొస్తుందనే రేవంత్‌రెడ్డి ద్వేషం పెంచుకున్నారని, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఎత్తిపోయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని మండిపడ్డారు. సాగునీరు లేక వానకాలం సాగు ప్రశ్నార్థకంగా మారి రైతులు ఎం చేయాలో తెలియని స్థితిలో ఉంటే.. ఈ రోజు దేవుడు దయతో వర్షాలు పడి ఊరట కలిగిందన్నారు. ఈ వర్షాలతో రైతులు నాటేసే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం గోస పెట్టకుండా చూడాలని, యూరియా, ఎరువులు సకాలంలో అందించాలని కోరారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 24 గంటలు విద్యుత్ ఇచ్చారో.. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అలానే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎరువులు ముఖ్యంగా అడుగు మందు 20-20 ఎరువు రకం రూ.2150, డీఏపీ రూ.1950 ఉందని, అడుగు మందు కొరత లేకుండా బ్లాక్ కాకుండా రూ.1350కి అందరికి అందుబాటులో ఉంచాలని, అలాగే 20-20 కూడా సిద్ధంగా ఉంచాలని కోరారు. యూరియా యాప్ ఇబ్బందులు కూడా తొలగించాలన్నారు. విద్యుత్, ఎరువుల సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. ఆయన వెంట రాయికల్ మున్సిపల్ చైర్మన్ రవి, వైస్‌చైర్మన్ తురగ సౌజన్య, శ్రీధర్ రెడ్డి, దావ సురేశ్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.