కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 26 : ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు రానున్న పార్టీ అధినేత కేసీఆర్‌కు దిష్టి తొలగాలని కోరుకుంటూ కరీంనగర్‌లోని కోతిరాంపూర్ చౌరస్తాలో కేసీఆర్ కటౌట్‌కు పార్టీ మహిళా నాయకులు దిష్టి తీసి, గుమ్మడికాయ కొట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి ఇప్పటివరకు కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఆయన ఓడిపోవాలని, అధికారంలోకి రావద్దంటూ ఎందరో దిష్టి పెడుతున్నారని చెప్పారు. ఆయనకు ఎలాంటి దిష్టి తగలకుండా నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు.
దేశం మొత్తం ఆదివారం జరగనున్న రజతోత్సవ సభ వైపు చూస్తున్నదని చెప్పారు. సభకు బీఆర్ఎస్ శ్రేణులతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, శ్రీకాంత్ నాయకులు గంధ మహేశ్, కర్ర సూర్యశేఖర్, కలర్ సత్తన్న పాల్గొన్నారు.