ఆది నుంచీ బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా, మరో చారిత్రక ఘట్టానికి వేదికైన ఎల్కతుర్తికి దండులా కదిలింది. బీఆర్ఎస్ ఆవిర్భవించి, 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం నిర్వహించిన రజతోత్సవ సభకు ఉప్పెనలా తరలింది. ఉదయం ఊరూరా పండుగ వాతావరణంలో గులాబీ జెండాలు ఎగురవేసి వేలాది వాహనాల్లో బయలు దేరగా, ‘బండెనక బండి’ అన్నట్టు దారులన్నీ వరంగల్ వైపే సాగాయి. దారి పొడవునా గులాబీ జెండాలు రెపరెపలాడగా, ‘జై తెలంగాణ, జైజై కేసీఆర్’ నినాదాలతో మార్మోగాయి. మధ్యాహ్నంకల్లా సభా స్థలికి చేరుకొని, సాయంత్రం వచ్చిన అధినేత కేసీఆర్‌కు నీరాజనం పట్టింది. భవిష్యత్ మనదేనని కేసీఆర్ చేసిన భరోసాతో నూతనోత్సాహం నింపుకొని వెనుదిరిగింది.
కరీంనగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): అడుగులన్నీ వరంగల్ వైపే పడ్డాయి. గులాబీ జెండాలు చేతబట్టి ఊరూవాడా ఎల్కతుర్తి సభకే కదిలాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆదివారం సాయంత్రం ఎల్కతుర్తిలో నిర్వహించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే కదిలారు. ప్రజలతో కలిసి పల్లెపల్లెనా పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ అవతరణ వేడుకలు జరుపుకొన్నారు. గులాబీ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం బస్సులు, స్కూల్ బస్సులు, కార్లలో రజతోత్సవ సభకు కదిలారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి కరీంనగర్ మీదుగా ఎల్కతుర్తికి వెళ్లారు. పెద్దపల్లి వైపు నుంచి రాజీవ్ రహదారిపై మీదుగా వచ్చిన కార్యకర్తలు కేబుల్ బ్రిడ్జి మీదుగా, ఇటు సిరిసిల్ల, జగిత్యాల నుంచి వచ్చిన కార్యకర్తలు అల్గునూర్ వంతెన మీదుగా తరలివెళ్లారు. ఏ బస్సు చూసినా కిక్కిరిసిపోయారు. ముఖ్యంగా యువకులు పెద్ద సంఖ్యలో కనిపించారు. దారిపొడవునా గులాబీ జెండాలు ఊపుతూ, ఉత్సాహంగా పాటలు పాడుతూ, ‘జై తెలంగాణ’ ‘జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు.
మధ్యాహ్నం 3గంటల వరకే సభకు చేరుకున్నారు. సాయంత్రం వరకు అధినేత కేసీఆర్ రాక కోసం ఓపికగా ఎదురుచూశారు. రాత్రి 7గంటలకు కేసీఆర్ సభా వేదికపైకి చేరుకోగానే చప్పట్లతో స్వాగతించారు. బీఆర్ఎస్ ఏర్పాటు, రాష్ట్రం కోసం సాగిన ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన, పదేళ్ల పాలన గురించి వివరించగా, అధినేత ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎంగడగుతూ.. మళ్లీ బీఆర్ఎస్సే వస్తుందంటూ భరోసా ఇవ్వడంతో నూతనోత్సాహంతో వెనుదిరిగారు.
కరీంనగర్ నియోజకవర్గం నుంచి వెళ్లే బస్సులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జెండా ఊపి ప్రారంభించారు. బస్సు టాప్‌పైకి ఎక్కి కార్యకర్తలు, నాయకులతోపాటు కేబుల్ బ్రిడ్జి వరకు కలిసి వెళ్లారు. అంతకు ముందు బొమ్మకల్‌లో జెండాలను ఆవిష్కరించారు. చింతకుంటలోని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
చొప్పదండి నుంచి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఎల్కతుర్తికి తరలి వెళ్లారు.మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎల్కతుర్తి సభలో కీలకంగా వ్యహరిస్తుండగా జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు నేతృత్వంలో కార్యకర్తలు సభకు తరలి వెళ్లారు.
హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశ్క్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఎల్కతుర్తి సభకు తరలి వెళ్లారు.పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ నేతృత్వంలో అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం ఎదురుగా బీఆర్ఎస్ జెండాను ఆయన ఆవిష్కరించి సభకు తరలి వెళ్లే బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు.
రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పెద్దపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రామగుండం నియోజకవర్గానికి చెందిన బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి, నియోజకవర్గం నుంచి సభకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
జగిత్యాలలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పార్టీ జెండా ఆవిషరించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులతో కలిసి భారీ సంఖ్యలో రజతోత్సవ సభకు తరలివెళ్లారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, గూడూరి ప్రవీణ్‌తో పాటు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో కలిసి సభకు బయలుదేరి వెళ్లారు.
ప్రజలు మోసపోయిన్రు
ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంత నరకంగా ఉందో.. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కూడా అలాగే ఉంది. సరిపోను బస్సులు లేవు. దొరికిన బస్సు ఎక్కితే సీట్లు లేక మహిళలు శిఖలు పట్టుకునేలా సీఎం రేవంత్ చేసిండు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలందరూ మోసపోయిన్రు. ఏడాదిన్నర కాలంలోనే ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి పుట్టింది. అనవసరంగా కేసీఆర్‌ను దూరం చేసుకున్నామన్న ఆవేదన ఉన్నది. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా..? కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎప్పుడు తెచ్చుకుందామా..? అని ఎదురు చూస్తున్నరు.
– నీలం సుజాత, కొత్తపల్లి
కాంగ్రెస్‌కు వణుకు పుడుతున్నది
కాంగ్రెస్ పేరు వింటేనే ప్రజలకు ఈసడింపు వచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, దేవుడి మీద పెట్టుకున్న ఓట్లు నమ్మి ఓట్లు వేస్తే ఇప్పుడు ఆర్థికంగా లేమని సీఎం తప్పించుకున్నడు. కేసీఆర్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలను పూర్తిగా స్థాయిలో అమలు చేయడంలేదు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. ఇలాంటి పార్టీకి బుద్ధి చెప్పడానికి నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావడంతో కాంగ్రెస్‌కు వణుకు పుట్టింది.
– కే కుమార్, మోత్కులగూడెం (జమ్మికుంట)
ప్రజలకు ధైర్యం చెప్పేందుకే సభ
రజతోత్సవ సభను ఒక ఇంటి పండుగలా ఎల్కతుర్తిలో జరుపుకొన్నం. ‘భయపడద్దు మేం ఉన్నాం’ అని సభ ద్వారా కేసీఆర్ ప్రజలకు ధైర్యం చెప్పిండు. సభ ముగిసే వరకు రాత్రవుతుందని, ప్రయాణం ఇబ్బంది అని చెప్పినా మహిళలు వినకుండా మా దేవున్ని చూసి ఆయన మాటలు వినాలని వచ్చిన్రు. కేసీఆర్ పాలనలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నరు. కాంగ్రెస్‌ను నమ్మిన ప్రజలు నట్టేన మునిగిన్రు. ఇలాంటి ప్రభుత్వం మాకొద్దు. మా కేసీఆర్ సారే మాకు కావాలని ప్రతి ఒకరూ కోరుకుంటున్నరు.
– ఫాతిమామేరీ, హుజూరాబాద్
మభ్యపెట్టి గెలిచిన్రు
కాంగ్రెస్ పథకాల ఆశచూపి ప్రజలను మభ్యపెట్టి గెలిచింది. ఆ పార్టీని పాతాళంలో బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు. కేసీఆర్ విజయవంతంగా అమలు చేసిన పథకాలను అన్నీ లేకుండా చేస్తున్నరు. పేదలకు పనికివచ్చే పథకాలు లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం? రైతు భీమా లేదు. రైతుబంధు మొత్తం పడలేదు. తులం బంగారం లేదు. ఇంకా ఎందుకీ ప్రభుత్వం?
– శ్రీపతి రవీందర్, సిర్సపల్లి (హుజూరాబాద్)
మళ్లీ కేసీఆరే రావాలి
ప్రజలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి బీఆర్ఎస్ను ఓడించిన్రు. ఇప్పుడు తెలంగాణను తెర్లు చేసుకుంటున్నరు. మళ్లీ కేసీఆరే రావాలి. ఆయన వస్తేనే ఆగమైన బతుకులు మళ్లీ చిగురిస్తయి. ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చిన్రు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నరు. మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ను ఖతం పట్టిస్తం.
-గడ్డి అయిలయ్య, తిమ్మాపూర్