peddapally | కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 24 : ఎల్కతుర్తిలో ఈనెల27న నిర్వహించే రజతోత్సవ సభకు అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు, ప్రజలు, అందరు చీమల దండులా కదిలివచ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెప్యాల రాజేశ్వర్రావు పిలుపునిచ్చారు. రజతోత్సవ సభకు సంభందించిన వాల్పోస్టర్ ను పలువురు కార్యకర్తలతో కలిసి గురువారం కాల్వశ్రీరాంపూర్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గ్రామంలో గోడలకు అంటించి ప్రచారం చేశారు. అనంతరం రాజేశ్వర్రావు మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. సర్కారుపై ప్రజలు తీవ్ర వ్యతిరేఖతతో ఉన్నారని. రాబోవు రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబందు ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుబంధును పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు.
రాబోవు రోజుల్లో కాంగ్రేస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన గులాబీ సైనికులు దండులా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జాలిగం రఘు, మేరవేన కుమార్, మేర్గవేన మహేశ్, చెప్యాల శ్రీకాంతరావు, తాత రవి, అరవింద్ లు పాల్గొన్నారు.