సిరిసిల్ల రూరల్/ గాంధీ చౌక్, మే 14: సిరిసిల్ల సెస్ మాజీ చైర్మన్, ప్రముఖ న్యాయవాది, బీఆర్ఎస్ సీనియర్ నేత దోర్నాల లక్ష్మారెడ్డి (68) అనారోగ్యంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మారెడ్డి తెల్లవారుజామున ఆయ న నివాసంలోనే కన్నుమూశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన దొర్నాల లక్ష్మారెడ్డి, 1980 లో న్యాయవాద వృత్తిలో చేరారు. సిరిసిల్ల కోర్టులో న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఇటు రాజకీయంలోనూ రాణించారు. టీడీపీ హయాంలో ఉమ్మ డి కరీంనగర్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్‌గా సేవలందించారు.
సిరిసిల్ల జడ్పీటీసీగా గెలుపొంది, జడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2009లో సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్‌కు వెన్నంటి ఉన్నారు. తెలంగాణ ఉద్యమంతోపాటు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేశారు. లీగల్ విభాగంలో విశేషమైన సేవలందించారు. లక్ష్మారెడ్డి సేవలను గుర్తించిన కేటీఆర్ 2015లో సెస్ ఎన్నికల్లలో సిరిసిల్ల రూరల్ డైరెక్టర్‌గా అవకాశం కల్పించి, చైర్మన్‌గా నియమించారు. ఐదేళ్ల పాటు సెస్ అభివృద్ధి, మనుగడకు విశేష సేవలందించారు. ఏడాది నుంచి కాలుకు గాయం కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అనారోగ్యం కూడా తోడవడంతో ఆదివారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన కొడుకు డాక్టర్ శ్యాంసుందర్‌రెడ్డి, కూతురు సునంద ఉన్నారు.
భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నేతలు
దోర్నాల లక్ష్మారెడ్డి వకీల్ సాబ్ మృతి వార్తతో ప్రజాప్రతినిధులు, నేతలు భారీగా తరలివచ్చారు. సిరిసిల్లలోని ఆయన నివాసానికి చేరుకుని, భౌతికకాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి సుద్దాల దేవయ్యతోపాటు తంగళ్లపల్లి నుంచి ఎంపీపీ పడిగెల మానస, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, అంకారపు రవీందర్, పడిగెల రాజు, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వల్లకొండ వేణుగోపాలరావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెన్నమనేని వెంకట్రావు, సింగిల్‌విండో చైర్మన్లు బండి దేవదాస్‌గౌడ్, కోడూరి భాస్కర్ గౌడ్, మాజీ చైర్మన్ పబ్బతి విజయేందర్‌రెడ్డి,రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు ఏసిరెడ్డి రాంరెడ్డితోపాటు పలువురు నేతలు నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
మంత్రి కేటీఆర్, వినోద్ సంతాపం
లక్ష్మారెడ్డి మృతి పట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన లక్ష్మారెడ్డి మృతి వార్త విని విచారం వ్యక్తం చేశారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి కేటీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు నేతలు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.