సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల రూరల్ 6: ‘గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచింది. ఈ అభివృద్ధి మున్ముందు కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి. అందుకే నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ట్ర మంతటా తిరుగుతున్న. నా ధైర్యం ఏంటంటే ఇక్కడి ప్రజలే. మీరే నా అండ. మీరే నా భరోసా. మీరే నన్ను కాపాడుకుంటరు. ఇక్కడి నాయకులతోపాటు మీ అందరిపైనా నాకు నమ్మ కం ఉన్నది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి కేటీఆర్ సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దని, ఇతర పార్టీల నాయకుల చిల్లర మాటలకు లొంగిపోతే మోసపోతామని హెచ్చరించారు. మన బతుకులు బాగు చేసిన కేసీఆర్ మన ముం దర ఉన్నారని, ఆయనను మూడోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని పిలుపునిచ్చారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలోని సుమారు వెయ్యి మంది వివిధ పార్టీలు, యువజన, కులసంఘాల నాయకులు బీఆర్ఎస్లో చేరగా, మంత్రి కేటీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గడిచిన తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి మీ కండ్లముందే కనిపిస్తున్నదని చెప్పారు. ఎటు చూసినా పచ్చదనం, తాగునీరు, సాగునీరు, సమృద్ధిగా కరెంట్ అందిస్తున్నామన్నారు. ఒకప్పుడు మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల, ఇప్పుడు సుభిక్షంగా ఉందన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందడంతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కేసీఆర్ పాలనలో కులాల పేరున కుంపట్లు, మతం పేరిట మం టలు, ప్రాంతం పేరిట పంచాయితీలు పెట్టలేదన్నా రు.
చాలామంది చాలారకాల మాటల దాడులు చేస్తున్నారని, అన్నింటినీ మీరు గ్రహిస్తున్నారన్నారు. సిరిసిల్లలోనూ రకరకాల ప్రయోగాలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలో నాయకత్వాన్ని చూస్తే ఎవరికైనా భయం కలుగుతుందన్నారు. ఇంత కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, చేసుకున్న అభివృద్ధిని దాచిదాచి దయ్యాల పాలుచేస్తామా..? అనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. కేసీఆర్ వంటి నాయకుడిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన టెక్ సెల్(సమాచారం కేంద్రం) కార్యాలయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా టెక్సెల్ విభాగంలోని సిబ్బందితో కేటీఆర్ మాట్లాడి సూచనలు అందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు దరువు ఎల్లన్న, బొల్లి రామ్మోహన్, అక్కరాజు శ్రీనివాస్, కుంబా ల మల్లారెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
‘కాంగ్రెస్‌లో ప్యారాచూట్, హెలీక్యాప్టర్ నాయకులను దించుతురట. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బయటివాళ్లను తీసుకొస్తడట’ అని ఓ మిత్రడు అడిగిండు. ఈ ప్రశ్నకు నేను ఒకటే మాట చెప్పిన. నా సిరిసిల్ల అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లకు ఏది మంచో.. ఏది చెడో తెలుసు. వాళ్లే నన్ను కాపాడుకుంటరని ధైర్యంగా అన్న. సిరిసిల్ల ఎట్ల మారిం దో మీకే కనపడుతున్నది. ఎవరి వల్ల ఇదం తా సాధ్యమైందో నా కంటే మీకే ఎక్కువ తెలుసు. మన బతుకులు బాగు చేసిన, కరెంటు బాగు చేసిన, సాగునీరు, తాగునీరు ఇచ్చిన, మన వ్యవసాయాన్ని బాగుచేసిన కేసీఆర్‌ను మరిచిపోవద్దు. మరెవరో గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
– మంత్రి కేటీఆర్