‘కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నది. కుట్రలు, కుతంత్రాలతో కేసులు పెడుతున్నా బెదిరేది లేదు. సామాన్య కార్యకర్తలపై భూకబ్జాల పేరిట పెడుతున్న కేసులపై హైకోర్టుకు, అవసరమైతే సుప్రీం కోర్టుకెళ్దాం. అన్యాయంగా కేసులు పెడుతున్న వారిపై పరువు నష్టం దావా వేస్తాం. మీకు అండగా నేనున్నా. ధైర్యంగా ఉండండి. కేసులకు భయపడేది లేదు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన నిలిచి కొట్లాడండి’ అని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం సిరిసిల్లలో ఆయన పర్యటించారు. తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరై, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
రాజన్న సిరిసిల్ల, జనవరి 4 (నమస్తే తెలంగాణ) సిరిసిల్ల టౌన్ : ‘మీకు అండగా నేనున్నా.. మీ కోసం రాష్ట్ర, జిల్లా పార్టీ ఉంది. న్యాయవాదుల బృందం ఉంది. కింద న్యాయస్థానం.. పైన దేవుడున్నాడు. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఒక్కొక్కరి సంగతి మళ్ల సూసుకుందాం. మనల్ని వేధించే వారికి వడ్డీతో సహా చెల్లిద్దాం. కేసులకు సంబంధించిన ఖర్చులు పార్టీ భరిస్తుంది. న్యాయపరంగా ఎదుర్కొనేందుకు హైకోర్టు న్యాయవాదులతో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేశాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. భూ కబ్జాలంటూ వివిధ పత్రికలలో బీఆర్ఎస్ నేతలపై వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండించారు.
‘భూ కుంభకోణాలు లేవు.. లంబ కోణాలు లేవు.. అవన్నీ అసత్యపు రాత’లంటూ కొట్టిపారేశారు. ఒకరో, ఇద్దరో అధికారం వచ్చిందని కేసులు పెట్టించి పైశాచికానందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. మనచేతిలో నాలుగైదుసార్లు ఓడిపోయి మతి స్థిమితం తప్పి కేసులు పెట్టిస్తున్నారని దుయ్యబట్టారు. పైన ముఖ్యమంత్రి ఎలా ఉన్నారో.. సిరిసిల్లలో వాళ్లు అలాగే ఉన్నారన్నారు. ఏ ఊరిలో ఎక్కడ ఎవరెవరు సతాయిస్తున్నారో..? రాసిపెట్టుకోవాలని, వారికి మిత్తితో సహా చెల్లించే బాధ్యత తనదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బరాబర్ చెబుతున్నా.. ఒక్కొక్కరికీ ఒక్కో టైం వస్తుందని చెప్పారు. టీవీలు చూసి, పేపర్లలో తాటికాయలంత ఆక్షరాలతో రాయంగనే ఆగం కావొద్దని ధైర్యం చెప్పారు.
సోషల్ మీడియాలో కొన్ని నిజాలొస్తున్నాయని, వాటిని చూడాలని సూచించారు. ఒక్క ఓటుకు ఐదేళ్లు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ప్రజలకు అర్థమైందన్నారు. నీలిరంగు పూసుకున్న ముసలి నక్క మోసాల మాదిరి కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని ప్రజలు గుర్తించారని చెప్పారు. మనకు కూడా మంచే జరిగిందని, బాధపడవద్దని కార్యకర్తలకు సూచించారు. చేసిన చిన్నచిన్న పొరపాట్లను సరిచేసుకుంటూ ముందుకు పోదామన్నారు. కేసీఆర్ పేదలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, కరోనా వంటి దిక్కుమాలిన పరిస్థితిలోనూ రైతుకు కష్టం రాకుండా చూసుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధూకర్, కోరుకంటి చందర్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మినరసింహారావు,పార్టీ నాయకులు చీటి నర్సింగరావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్లు, మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన
రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన నడుస్తున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న వారిపై అక్రమ కేసులు పెడుతూ అణచివేసే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్, కేటీఆర్‌పై అక్రమంగా కేసులు పెట్టే కుట్రలు పన్నతున్నది. పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయానక వాతావరణం సృష్టిస్తున్నది. ఇది మంచి కాదు. రాజకీయాల్లో కేసులు సర్వసాధారణమే. రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ పదేండ్ల కాలంలో విశేష అభివృద్ధి చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనను అస్తవ్యస్తం చేస్తున్నది. ప్రజా పాలన పేరుతో తీసుకున్న దరఖాస్తులు ఎక్కడపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికే మూడు పంటలకు రైతు బంధు ఇవ్వలేదు. ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ప్రజలు మోసపోయామని మదనపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడితే జోకర్‌గా చూస్తున్నారు. గ్రామీణ నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ వైఫల్యాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అరాచక పాలనపై ప్రేక్షక పాత్ర పోషించవద్దు. సైనికుల్లాగా పనిచేయాలి.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
కుట్రలకు భయపడొద్దు
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, కుట్రలకు భయపడాల్సిన పనిలేదు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచింది. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నది. ఇటీవల సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, జిందం దేవదాస్, అగ్గి రాములుపై రాజకీయ కక్షతోనే కేసులు పెట్టించారు. సిరిసిల్లలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. కేటీఆర్‌ను బద్నాం చేయాలన్న కుట్రలో భాగంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే తప్పులు జరిగినట్లు చిత్రీకరిస్తున్నారు. వాస్తవానికి 2007లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జంగ్ సిపాయి భూములకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్(ఎన్వోసీ) అధికారులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమ్ముకోవడానికి జంగ్ సిపాయికి అనుమతులు ఇచ్చింది. 2001లో చట్ట ప్రకారం కొనుగోలు చేసిన భూమి అక్రమం అంటూ కేసులు పెట్టారు. కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టుకు వెళ్లి పోరాటం చేసి నష్టపరిహారం చెల్లించేలా కృషి చేస్తాం. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దు.
– బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
స్థానిక సంస్థల్లో గులాబీ రెపరెపలాడాలి
ఎమ్మెల్యే ఎన్నికల్లో జరిగిన తప్పులు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది, నాది, మనందరిది. శ్రేణులందరికీ పార్టీ సంపూర్ణ అండగా ఉంటుంది. పార్టీకి నిబద్ధతతో పనిచేసే వారికి సంపూర్ణ సహకారం అందిస్తా. అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామగ్రామానా గులాబీ జెండా ఎగిరేలా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. అరచేతిలో స్వర్గం చూపిన కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిద్దాం. ఎంపీటీసీ, కౌన్సిలర్, సర్పంచ్‌లుగా కావాలనుకునే వారంతా ప్రజా క్షేత్రంలో గట్టిగా నిలబడాలి.
– కార్యకర్తలకు కేటీఆర్ నిర్దేశం
ధైర్యంగా పోరాడుతాం
అలవిమాలిన హామీలిచ్చిన మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మోసాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వంపై ధైర్యంగా పోరాడుతాం. కేసులను పరిష్కరించే దిశగా లీగల్ సెల్ రామన్న కనుసన్నల్లో ఎప్పటికప్పుడు పనిచేస్తుంది. కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు