కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 19 : తనను ఎంపీగా ఆశీర్వదించి గెలిపిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానని, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పోరాడి అభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రజలు బండి సంజయ్‌ను ఎంపీగా గెలిపిస్తే ఐదేళ్ల కాలంలో అధికారంలో ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఐదు కొత్తలు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. మతం పేరుతో ఓట్లు అడగడం తప్ప అభివృద్ధి కోసం ఎప్పుడూ మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. శుక్రవారం తీగలగుట్టపల్లిలోని విజేత గ్రీన్ హోమ్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తాను గతంలో ఎంపీగా ఉన్నప్పుడే రైల్వేలైన్‌పై ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించేందుకే తీగలగుట్టపల్లిని నగరంలో విలీనం చేశామని, స్మార్ట్‌సిటీ తీసుకువచ్చి రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకురాగలిగానన్నారు. కానీ, బండి సంజయ్ మాత్రం ఒక్క గుడి తేలేదని, బడి తేలేదన్నారు. తాను త్రిబుల్ ఐటీ కోసం ఎంతో కృషి చేశానని, కానీ బండి సంజయ్ మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే పార్లమెంట్లో కరీంనగర్, రాష్ట్ర సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా నిలుస్తారని తెలిపారు.
ఎన్నికలు వస్తేనే బండి సంజయ్‌కి ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. ప్రజల మనోభవాలతో ఆడుకుంటున్న బండికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తన రాజకీయ పబ్బం కోసం ఆడ్డగోలుగా మాట్లాడడం తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. ఎంపీగా ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయారని దుయ్యబట్టారు. ఎంపీగా వినోద్‌కుమార్ స్మార్ట్‌సిటీ తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంట కళ్యాణి, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ,పాల్గొన్నారు.
చిగురుమామిడి, ఏప్రిల్ 19: హుస్నాబాద్ కోర్టు ఆవరణలో శుక్రవారం కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌తో న్యాయవాదులు, కక్షిదారులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే ఐదేళ్లలో కరీంనగర్‌ను అభివృద్ధి చేసి చూపుతానన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ మాట్లాడుతూ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి వినోద్ కుమార్ ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, నాయకులు మదన్ మోహన్ రెడ్డి, అన్వర్ పాషా, వెంకట్రామిరెడ్డి, రవీందర్ గౌడ్, బార్ ప్రెసిడెంట్ మురళీమోహన్, ఏజీపీ కన్నోజు రామకృష్ణ, న్యాయవాదులు బెజ్జంకి రాంబాబు, బాకం సంపత్, కకేర్ల శివ శంకర్ గౌడ్, చిత్తారి హన్మయ్య, ఒగ్గోజు సదానందం తదితరులున్నారు.