కార్పొరేషన్, మే 1: కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం పోరాటం చేసేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, అన్ని సమయాల్లో కార్మికులకు అండగా నిలిచామని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం కార్మిక దినోత్సవం సందర్భంగా నగరంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన మే డే వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి పాల్గొన్నారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట, బస్టాండ్ చౌరస్తాలో, ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా, వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద నిర్వహించిన వేడుకలకు హాజరై కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే తప్పకుండా తమ హక్కులను సాధించుకోవచ్చన్నారు. బీఆర్ఎస్ హయాంలో కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిందని, ఆటో కార్మికులు, హమాలీలకు ఇతర వర్గాల వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. కార్మికులకు తాము అన్ని సమయాల్లో అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే ఏకైక పండుగ కార్మిక దినోత్సవమన్నారు. బీఆర్ఎస్ కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. వారి సమస్యల పరిష్కారానికి అన్ని సమయాల్లో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, నాయకులు ఎడ్ల అశోక్, గంట శ్రీనివాస్, బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, ఆకుల మల్లేశం, ముత్యాల కృష్ణ, రమేశ్, సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా సీపీఎం, సీపీఐ పార్టీలతో పాటు అనుబంధ సంస్థలు ఏఐసీటీయూ, సీఐటీయూ, హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, శంకరపట్నం, చిగురుమామిడి, వీణవంక, మానకొండూర్ మండలాల్లో ఆయా కార్మిక సంఘ నాయకులు, తదితరులు ఎర్రజెండాను ఎగురవేశారు. అంతకుముందు ఆట, పాటలు, డప్పుచప్పుళ్లతో ర్యాలీలు తీశారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కరీంనగర్ మండలంలోని చామనపల్లి, నగరంలోని రైల్వే గేటు వద్ద రైల్వే హమాలీ కార్మికులు నిర్వహించిన మేడే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి రాకుండా ఓడించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.