సిరిసిల్ల టౌన్ : బీసీ డిక్లరేషన్ సాధన కోసం బీఆర్ఎస్ ఉద్యమిస్తున్నదని కేటీఆర్ సేన ( KTR Sena ) రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్( Manohar) తెలిపారు. కామారెడ్డి సాక్షిగా రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ ( BC declaration ) పై ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
42శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు అభూతకల్పన సృష్టించి పాలాభిషేకాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీ వేదికగా మరో కొత్త డ్రామాకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. 42శాతం రిజర్వేషన్ రాజకీయ, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ బిడ్డలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ మెడలు వంచి ఏ విధంగా సాధించుకోవాలో బీఆర్ఎస్కు తెలుసని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కరీంనగర్ వేదికగా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా బీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుందన్నారు. పాదయాత్రల పేరుతో మరోసారి ప్రజలను మోసం చేయొద్దని సూచించారు.
రాబోవు స్థానిక ఏన్నికలలో కాంగ్రెస్, బీజేపీలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకుడు శీలం స్వామి, కేటీఆర్ సేన తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్, మేరుగు తిరుపతి, నమిలికొండ అనిల్, ప్రశాంత్, అజయ్, విన్నుబాబు, కృష్ణ, వెంకటేష్, శేఖర్, అజయ్, రాజు, శ్రీనివాస్, తదితరులున్నారు.