హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మరోవైపు హన్మకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్ ఎదుట హుజూరాబాద్ బీఆర్ఎస్ నాయకులు ధర్నా దిగారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని హితవుపలికారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రేవంత్ నిరంకుశ వైఖరికి నిదర్శనం
– చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర, జూన్ 21: కౌశిక్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం సీఎం రేవంత్ నిరంకుశ వైఖరికి నిదర్శనమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, పథకాల అమలు గురించి ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను అక్రమ కేసులతో భయపెట్టలేరని స్పష్టం చేశారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్రమాలను అడుగడుగునా ప్రశ్నిస్తున్నారు కాబట్టే కేటీఆర్, హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డిపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అక్రమ అరెస్టులు మానుకోవాలి
రాష్ట్రంలో ప్రశ్నించే ప్రజాప్రతినిధులను అరెస్టుల పేరుతో భయబ్రాంతులకు గురిచేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి నిలువెత్తు నిదర్శనం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరెస్ట్. శంషాబాద్ విమానాశ్రయంలో ఆరెస్ట్ చేయడం అత్యంత దారుణంగా పరిగణిస్తున్నాం. గతంలోనూ ఆయనపై అనేక కేసులను ప్రభుత్వం పెట్టింది. అన్నింటిలోనూ ఆయన చట్టానికి సహకరిస్తూ వచ్చారు. అలాంటప్పుడు.. ఆకస్మికంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమచ్చిందో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇటువంటి ఆరెస్ట్ వల్ల.. బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయలేరు.
అక్రమ అరెస్టుల పేరుతో ఇబ్బందులకు గురిచేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ భయపడరన్న విషయాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినప్పుడు.. వాటిని బాధ్యతాయుతంగా తీసుకొని పరిష్కరించాలే తప్ప.. విమర్శించే వారి గొంతు నొక్కాలని చూడడం అత్యంత దారుణం. ఇక ముందైనా ఇటువంటి చర్యలకు ప్రభుత్వం చరమగీతం పలుకకపోతే ప్రజలే తగిన బుద్ధిచెపుతారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్న విషయాన్ని సైతం ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. – చల్మెడ లక్ష్మీ నరసింహారావు, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి
కేసులకు భయపడేది లేదు
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 21: హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం అన్యాయమని, కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, పథకాల అమలుపై ప్రశ్నిస్తున్నందుకు కౌశిక్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ క్యాడర్లో భయాన్ని సృష్టించడానికి నిర్బంధకాండ కొనసాగిస్తున్నదని దుయ్యబట్టారు. ఎవరేం చేసినా..?, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ భయపడే ప్రసక్తే లేదని, ఎదురొవడానికి సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాశాన్ని కోల్పోయిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ రేవంత్‌రెడ్డితో కుమ్ముకై బీఆర్ఎస్ నాయకులపైన తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా..?
– జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
జగిత్యాల, జూన్ 21: ‘కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అన్యాయాలు, మోసాలపై ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా..? ఇంది ఎంత మాత్రం సరికాదు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో అక్రమంగా అరెస్ట్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని’ జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఒక ప్రకటనలో విమర్శించారు. గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ సరార్ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిని తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది గురిచేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు, బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కౌశిక్ రెడ్డిని బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే అరెస్టు అక్రమం
– బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్
హుజూరాబాద్ టౌన్, జూన్ 21: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బండ శ్రీనివాస్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తున్నారని కౌశిక్‌రెడ్డిపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలను మరిచిందన్నారు. పరిపాలన చేతకాక బీర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో ప్రజలంతా చైతన్యవంతులై కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.