Bus pass prices | సిరిసిల్ల టౌన్, జూన్ 11: విద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గించాలని ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం సిరిసిల్ల బస్ డిపో ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న క్రమంలో ప్రభుత్వం బస్ పాస్ చార్జీలను పెంచి పేద విద్యార్థులపై భారం మోపుతుందని విమర్శించారు.
ప్రస్తుతం ఉన్న బస్ పాస్ చార్జీలపై 20 శాతం అదనంగా పెంచి దోచుకోవడం సిగ్గుచేటన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాల్సిన ప్రభుత్వమే చార్జీలు పెంచడం ద్వారా వారిని చదువులకు దూరం చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు విద్యార్థుల బస్ పాస్ చార్జీలే దొరికాయా అంటూ ప్రశ్నించారు. వెంటనే పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మట్టే శ్రీనివాస్, వడ్లూరి సాయికుమార్, అనిల్ గౌడ్, కాసాల శ్రీనివాస్, ఎండీ ఆజ్ఞ, ఎస్. అప్రోజ్, కృష్ణ, అర్జున్, నరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.