కరీంనగర్ కార్పొరేషన్/జగిత్యాల/మంథని, డిసెంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున స్పందించారు. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలతోపాటు పంచామృత అభిషేకాలు చేశారు. తెలంగాణతల్లి విగ్రహం ఉద్యమ ఉద్వేగానికి ప్రతీకగా నిలుస్తుందని, ఆమె రూపం చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉద్యమస్ఫూర్తి రగులుతుందని, యావత్ తెలంగాణ జాతి సమష్టి ఉద్యమం, సాంస్కృతిక పోరాటం గుర్తుకు వస్తుందని ఉద్వేగానికి లోనయ్యారు.
కానీ, తెలంగాణతల్లి పేరు చెప్పి కాంగ్రెస్ మూర్ఖులు చేసిన అపచారానికి చరిత్ర తెలియని ఆ పార్టీని క్షమించాలని వేడుకున్నారు. పార్టీ అధిష్టానం మెప్పు కోసమే రేవంత్‌రెడ్డి విగ్రహ ఆకృతిని మార్చుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయాలు మానుకొని.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్.. గన్నేరువరం మండలంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. రామడుగు మండలం తిర్మలాపూర్, కొడిమ్యాల మండలం నమిలికొండలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. రామగుండం మున్సిపల్ ఆఫీస్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ క్షీరాభిషేకం చేశారు.
జగిత్యాల జిల్లా రాయికల్‌లో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, సిరిసిల్లలో నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఆయాచోట్ల నాయకులు మాట్లాడారు. తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను తెలంగాణ తల్లి చేతిలో నుంచి మాయం చేసి.. కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టడం అన్యాయమన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై కక్షతో విగ్రహాన్ని మార్చడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుందన్నారు.
కార్పొరేషన్, డిసెంబర్ 10: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయం ఉట్టిపడేలా రూపొందించుకున్న తెలంగాణ తల్లివిగ్రహాన్ని కాదని, కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్‌గాంధీ మెప్పు కోసం సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు. ఎక్కడైనా తల్లిని తల్లిగా పూజించుకోవాలే తప్ప తమ స్వార్థాల కోసం విగ్రహాలను మార్చడం సరికాదని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి పార్టీ పెద్దల మెప్పుకోసం పని చేయడం మానుకోవాలని, తెలంగాణ ప్రజల మెప్పు పొందేలా పని చేసి చూపించాలని హితవుపలికారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్యర్యంలో తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జీవీఆర్ మాట్లాడుతూ, ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను పక్కదారి పట్టించేందుకు విగ్రహ మార్పు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. ఇలాంటి పనులను తెలంగాణ ప్రజలెవ్వరూ హర్షించరని తెలిపారు.
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ యాదగిరి సునీల్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, శ్యాంసుందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, నాయకులు రెడ్డవేణి మధు, గడ్డం ప్రశాంత్‌రెడ్డి, చందు, ఆరె రవి తదితరులు పాల్గొన్నారు.
కొడిమ్యాల, డిసెంబర్ 10: కాంగ్రెస్ తల్లి విగ్రహం వద్దని, తెలంగాణ ప్రజలు అభిమానించే తెలంగాణ తల్లి విగ్రహమే కావాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన కొడిమ్యాల మండలం నమిలకొండలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవులు, కళాకారులు, మేధావులు కలిసి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారన్నారు. అలాంటి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. కేవలం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, నాయకులు ఒల్లాల లింగాగౌడ్, చింతపంటి ఆదయ్య, మల్యాల నరేశ్, కొత్తూరి స్వామి, మల్యాల లింగయ్య, పరదేశీ, అంజన్‌కుమార్, చాంద్‌పాషా, ప్యాట అంజి, రొడ్డ శరత్, మొగిలిపాలెం రమేశ్, రాచకొండ చంద్రమోహన్, స్రవంతి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
గన్నేరువరం/ ఇల్లంతకుంట, డిసెంబర్ 10 : తెలంగాణ విగ్రహ రూపం మార్చినంత మాత్రాన తెలంగాణ చరిత్ర మారదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకే విగ్రహం మార్పు చేశారని మండిపడ్డారు. మంగళవారం గన్నేరువరంలో తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఇల్లంతకుంటలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ తల్లి రూపం మార్చి కాంగ్రెస్ తల్లి రూపం తీసుకురావడం వల్ల ప్రజలు కోరిన మార్పు జరగదన్నారు. ఇలాంటి విగ్రహాన్ని ప్రజలు ఏనాడూ అంగీకరించన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటి వరకు పాత పనులను చేయడమే తప్పా ఒక్క కొత్త పనికి పూనుకోలేదని మండిపడ్డారు.
గోదావరిఖని, డిసెంబర్ 10: తెలంగాణ తల్లి మన అస్తిత్వానికి ప్రతీక అని, ఆ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ స్ఫూర్తిని అవమానించడమేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలె తప్పా.. తల్లి రూపురేఖలు కాదని సూచించారు. మంగళవారం రామగుండం మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం చందర్ మాట్లాడుతూ, తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గురించి కనీసం సోయిలేకుండా హస్తం గుర్తు పోలి ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర అధికార చిహ్నంలో చార్మినార్ వద్దని, కాకతీయ కళాతోరణం ఎందుకని.. ఇప్పుడు తెలంగాణ తల్లే వద్దంటున్నారని.. రేపు తెలంగాణ రాష్ట్రమే ఎందుకని కూడా అంటారని విమర్శించారు. కాంగ్రెస్ తల్లికి ఎప్పటికీ తెలంగాణ గల్లీలో స్థానం ఉండదన్నారు. ఇక్కడ కార్పొరేటర్లు అయిత శివకుమార్, కుమ్మరి శ్రీనివాస్, కవిత సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, నాయకులు మూల విజయారెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, చెలకలపల్లి శ్రీనివాస్, మేతుకు దేవరాజ్, నారాయణదాసు మారుతి, బొడ్డు రవీందర్, మేడి సదయ్య, పిల్లి రమేశ్, సట్టు శ్రీనివాస్, సంధ్యారెడ్డి, తోకల రమేశ్ ఉన్నారు.