Dharmaram | ధర్మారం, ఆగస్టు 29 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములలో ఇండ్ల నిర్మాణాలకు, అలాగే వెంచర్లలో లేఅవుట్ లేకుండా అక్రమంగా జీపీ ద్వారా అనుమతులు, ఇంటి నంబర్ల కేటాయింపులను నిలిపివేయాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు బీఆర్ఎస్ నాయకులు శనివారం స్థానిక తహసీల్దార్ డీ శ్రీనివాస్, ఎంపీడీవో వీ సుమలతకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో గ్రామపంచాయతీ ద్వారా ఇంటి నెంబర్లను కేటాయిస్తున్నారని ఆ ఫిర్యాదులో నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికే జీపీ ద్వారా ఇంటి నంబర్లను కేటాయించడం వల్ల అక్రమార్కులు వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని వారు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, అక్రమ కేటాయించిన ఇంటి నంబర్లను రద్దు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
అలాగే పంచాయతీ పరిధిలోని 461/A, 461/A, 461/D/3, 461/E/1/1, 461/3/3 లలో కొందరు డీటీసీపీ లేఅవుట్ అనుమతి లేకుండా ఆక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఈ సందర్భంగా వారు ఫిర్యాదు చేశారు. ఇట్టి అక్రమ వెంచర్ల పై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీలతను కోరారు. అధికారులకు ఫిర్యాదు చేసిన వారిలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, పార్టీ పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు, పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, వార్డు మెంబర్ గాజుల రాజు, సోషల్ మీడియా మాజీ కన్వీనర్ దేవి నళిని కాంత్, నాయకులు గుర్రం తిరుపతి గౌడ్, దేవి రాజేందర్ ,గంధం తిరుపతి, వేల్పుల కుమార్ తదితరులు ఉన్నారు.