Dharmaram | ధర్మారం, జూలై 10 : అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రిప్పర్ ను శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామంలో స్థానిక బీ ఆర్ ఎస్ నాయకులు పట్టుకున్నారు. ఆ పార్టీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం …గ్రామంలో ఇండ్ల నిర్మాణానికి అవసరమైన మొరంను ఓ ట్రిప్పర్ తీసుకువచ్చింది. గ్రామంలోకి తీసుకు వస్తున్న మొరం కు అనుమతితో తీసుకు వస్తున్నారా లేక అక్రమంగా తరలిస్తున్నారా అని వాహనాన్ని నిలిపివేసి బీఆర్ఎస్ ఎస్టీ సెల్ మాజీ మండలాధ్యక్షుడు అజ్మీర మల్లేశం నాయక్, లంబాడి తండా (బీ) పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు అజ్మీర తిరుపతి నాయక్ తో పాటు పలువురు యువకులు డ్రైవర్ ను ప్రశ్నించారు.
మొరంను ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నారని వారు డ్రైవర్ ను ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. ప్రజల అవసరాల కోసం మొరం తీసుకురావడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎలా మొరం తరలించుకొని వస్తారని వారు డ్రైవర్ ను ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో వారు రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్ ఐ -1 శివ కోటేష్ గ్రామానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. వాహన డ్రైవర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్ఐ ఆధ్వర్యంలో వాహనాన్ని ధర్మారం తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. తగు చర్యల కోసం నివేదికను తహసీల్దార్ కు నివేదిస్తానని ఆర్ ఐ తెలిపారు.