సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 5: ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్‌లతో ఆపలేరని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. ప్రజాపాలన అందిస్తారనే నమ్మకంతో కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రజలకు రాక్షస పాలన ఎలా ఉంటుందో చూపిస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వ నిర్బంధ పాలనకు భయపడేదిలేదని, తెలంగాణకు పోరాటం కొత్త కాదని, ప్రభుత్వ దుర్మార్గ చర్యలపై మరో పోరాటానికి ప్రజలంతా సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న నాయకులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులతో నిర్బంధిస్తున్నదని మండిపడ్డారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితోపాటు ఆయనతో మాట్లాడేందుకు వెళ్లిన ఉద్యమనేత హరీశ్‌రావు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. అయినా బీఆర్ఎస్ నాయకులకు అరెస్ట్‌లు కొత్తేమీ కాదని స్పష్టం చేశారు.
ఉద్యమంలో ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శించడమే ఆయన పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెడుతున్న రేవంత్‌రెడ్డి నీచబుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, రాబోయే రోజుల్లో ఛీత్కారం తప్పదని హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటు వేసిన ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరని చెప్పారు.
ఏడాది పాలనలో ఒక్క హామినీ అమలు చేయకుండానే ప్రజాపాలన పేరిట విజయోత్సవ సభలు జరుపుకోవడం ఏంటని ప్రశ్నించారు. 3,500 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నామని చెప్పి, ఒక్క ప్రొసీడింగ్ ఇవ్వలేదన్నారు. సిరిసిల్ల పట్టణంలోనే 2,150 ఇండ్లు పూర్తి చేసి 1,900 కుటుంబాలకు అందించిన ఘనత బీఆర్ఎస్దే అని గుర్తుంచుకోవాలన్నారు. డ్రాలో మరో 800 మందికి మండెపల్లి ప్రాంతంలో పట్టాలు, ప్రొసీడింగ్‌లు ఇచ్చామని, కానీ, ఆ ప్రొసిడింగ్‌లను రద్దు చేసింది కాంగ్రెస్సేనని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వెళ్లిన వారిని పోలీసులతో కొట్టిస్తున్నారని ఆరోపించారు.
డ్రాలో అర్హత సాధించిన లబ్ధిదారులకు గతంలో కేటాయించిన ప్లాట్లను ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల పేరు పెట్టుకోనైనా సరే అందించాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, న్యాలకొండ రాఘవరెడ్డి, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, మాట్ల మధు, గుండ్లపల్లి పూర్ణచందర్, పోచవేని ఎల్లయ్యయాదవ్, కుంబాల మల్లారెడ్డి, సత్తార్, సిలువేరి చిరంజీవి, ప్రేమ్‌కుమార్, ఇమ్మనేని అమర్‌రావు, సురభి నవీన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.